Telugu Global
Telangana

2008 డీఎస్సీ అభ్యర్థులకు ఊరట..

సుదీర్ఘకాలంగా కోర్టులో పోరాడుతున్న బీఈడీ అభ్యర్థులకు ఊరట లభించినట్లయింది. దాదాపు 2వేలమందికి ఇప్పుడు న్యాయం జరుగుతుంది.

2008 డీఎస్సీ అభ్యర్థులకు ఊరట..
X

2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీఈడీ అర్హతతో డీఎస్సీ రాసిన అభ్యర్థులకు ఊరటనిచ్చేలా తెలంగాణ హైకోర్ట్ తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఏపీలో 2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణలో కూడా డీఎస్సీ అభ్యర్థులకు మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్ట్, ఏపీలో ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న బీఈడీ అభ్యర్థుల ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలని పేర్కొంది.

ఏంటీ వివాదం..?

2008లో 52,655 ఉపాధ్యాయ పోస్ట్ లకు డీఎస్సీ పరీక్ష జరిగింది. అప్పట్లో ఎస్జీటీ(ఎలిమెంటరీ స్కూల్) పోస్ట్ లకు డీఈడీ, బీఈడీ చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్(హై స్కూల్) పోస్ట్ లకు కేవలం బీఈడీలు అర్హులు. అయితే ఎస్జీటీ పోస్ట్ లకు కేవలం డీఈడీ చేసినవారినే అర్హులుగా పరిగణించాలని వారు కోర్టుకెక్కడంతో వివాదం మొదలైంది. నోటఫికేషన్లో ఇద్దరికీ అర్హత ఉన్నట్టు ప్రకటించినా, కోర్టు తీర్పుతో డీఈడీ చేసినవారికి 30శాతం సీట్లు రిజర్వ్ చేశారు. దీంతో బీఈడీ చేసినవారు ఇబ్బంది పడ్డారు. కానీ నోటిఫికేషన్ ప్రకారం తమకు న్యాయం చేయాలంటూ అప్పటినుంచి ఇప్పటి వరకు డీఎస్సీలో మెరిట్ సాధించిన బీఈడీ అభ్యర్థులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. అది ఇన్నాళ్లకు ఫలించింది.

2008 డీఎస్సీలో డీఈడీ అభ్యర్థులకు రిజర్వ్ చేసిన 30శాతం కోటాలో మిగిలిపోయిన పోస్ట్ లను బీఈడీ అభ్యర్థులతో భర్తీ చేయాలని హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. అప్పటి డీఎస్సీలో అర్హత సాధించి, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయినా పోస్టులు దక్కని బీఈడీ అభ్యర్థులను ఈ పోస్టులకు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. దీంతో సుదీర్ఘకాలంగా కోర్టులో పోరాడుతున్న బీఈడీ అభ్యర్థులకు ఊరట లభించినట్లయింది. దాదాపు 2వేలమందికి ఇప్పుడు న్యాయం జరుగుతుంది. వీరంతా 14ఏళ్లుగా ఉద్యోగాలకోసం వేచి చూస్తున్నారు.

First Published:  30 Sep 2022 1:51 AM GMT
Next Story