Telugu Global
Telangana

బుద్వేల్‌లో హైకోర్టు.. బయోడైవర్సిటీ పార్క్‌కు ముప్పు.!

ఇటీవల కొత్త హైకోర్టు నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌ బాబుతో పాటు ముగ్గురు జడ్జిలు పరిశీలించారు.

బుద్వేల్‌లో హైకోర్టు.. బయోడైవర్సిటీ పార్క్‌కు ముప్పు.!
X

తెలంగాణ హైకోర్టును బుద్వేల్‌ సమీపంలోని 100 ఎకరాల్లోకి మార్చాలన్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. న్యాయవాదులే కాదు.. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు నిర్మాణం కోసం ఎంచుకున్న 100 ఎకరాల భూమిలో.. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్నో ఏళ్లుగా శ్రమించి 35-40 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఆగ్రో బయోడైవర్సిటీ పార్క్‌ ఉండడమే వీరి ఆందోళనకు కారణం.

ఇటీవల కొత్త హైకోర్టు నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌ బాబుతో పాటు ముగ్గురు జడ్జిలు పరిశీలించారు. ఇదే సమయంలో అగ్రి బయోడైవర్సిటీ పార్కు విషయాన్ని అగ్రికల్చర్‌ యూనివర్సిటీకి సంబంధించిన పలువురు జీవవైవిధ్య నిపుణులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ మాజీ అధ్యాపకులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అగ్రి-బయోడైవర్సిటీ పార్కును సంరక్షించాలని మంత్రుల బృందానికి వినతిపత్రం అందించారు.

అగ్రి-బయోడైవర్సిటీ పార్కు మొత్తం 130 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో మూలగుండు సరస్సు 65-70 ఎకరాల్లో విస్తరించి ఉంది. మిగిలిన స్థలాన్ని 2008లో ఆల్‌ ఇండియా కో-ఆర్డినేటెడ్‌ రీసెర్చ్ ప్రాజెక్టు కింద ఇండియన్‌ కౌన్సిల్ ఆఫ్‌ అగ్రికల్చరల్ రీసెర్చ్‌-ICAR, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ పార్కులో రైతులకు మేలైన, సుస్థిరమైన లాభాలనందించే అగ్రో-అటవీ రకాలను ఉత్పత్తి చేస్తున్నారు.

2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. అప్పటినుంచి ఈ ప్రాజెక్టు కోసం విశేషమైన కృషి జరిగింది. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు ఢిల్లీలోని ఆరావళి బయోడైవర్సిటీ పార్క్‌, యమునా బయోడైవర్సిటీ పార్క్‌ సహా అనేక ప్రాజెక్టులను అప్పటి సీఎం రోశయ్య వ్యక్తిగతంగా సందర్శించారు. దాదాపు ఈ భూమిలో లక్షా 50 వేలకుపైగా వివిధ జాతుల మొక్కలను నాటారు. ఇందులో VIP ప్లాంటేషన్ బ్లాక్‌తో పాటు తాటి, టేకు, వేప, మహువా, ఫికస్, ఉసిరి, టోడీ, ఫీనిక్స్, పండ్ల చెట్లు మరియు ఔషధ మొక్కలు ఇలా వివిధ బ్లాకులున్నాయి. 313 జాతులకు చెందిన 439 రకాలైన వృక్ష సంపద, 348 జాతులకు చెందిన అరుదైన జీవరాశులకు ఈ పార్కు ఆవాసంగా మారింది.

16 రకాల క్షీరదాలు, 139 రకాల పక్షులు, 42 రకాల సరిసృపాలు, 151 రకాల అకశేరుకాలకు ఈ పార్కు నెలవుగా ఉంది. అనేక అంతరించిపోతున్న జాతులకు చెందిన మొక్కలు ఈ పార్కులో సంరక్షించబడుతున్నాయి.

లుషి అనే అరుదైన గడ్డి జాతి మొక్క.. దాదాపు 215 ఏళ్ల తర్వాత పట్టణ ప్రాంతాల్లో గుర్తించబడింది ఈ పార్కులోనే. వీటితో పాటు సీతాకోకచిలుకలకు ఆవాసమైన మొక్కలతో ప్రత్యేకమైన బట్టర్‌ఫ్లై పార్క్‌ను సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్ని వ్యవసాయ పరిశోధనలకు మూలంగా మారాయి. ఇలాంటి అమూల్యమైన సంపదని నాశనం చేసి నూతన హైకోర్టు భవనాలను నిర్మించాలని నిర్ణయించడం పర్యావరణానికి ఉరి వేయడంలాంటిదేనంటున్నారు పర్యావరణ వేత్తలు.

First Published:  6 Jan 2024 11:53 AM GMT
Next Story