Telugu Global
Telangana

వివాదాస్పదం అవుతున్న జస్టిస్ అభిషేక్‌ రెడ్డి బదిలీ

తెలంగాణ న్యాయమూర్తులను ఒకరి తర్వాత ఒకరిని బదిలీపై పంపిస్తున్నారని ఆక్షేపించారు. ఈ బదిలీ న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రశ్నించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వివాదాస్పదం అవుతున్న జస్టిస్ అభిషేక్‌ రెడ్డి బదిలీ
X

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. అభిషేక్ రెడ్డిని తెలంగాణ నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలిజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ నిఖిల ఎస్‌. కరియెల్‌ను కూడా పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ సిఫార్సు వెళ్లింది.

జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డి బదిలీ నిర్ణయంపై తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు తీవ్రంగా స్పందించారు. ఈ విషయం తెలియగానే గురువారం హైకోర్టు బార్‌ అసోసియేషన్ కార్యాలయంలో అత్యవసరంగా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. బదిలీ వెనుక కారణాలపై చర్చించారు. తెలంగాణకు చెందిన హైకోర్టు న్యాయమూర్తులకు అన్యాయం చేసేలా వరుసగా బదిలీలు జరుగుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు రఘునాథ్ విమర్శించారు.

ఇప్పటికే ఎం.ఎస్‌ రామచంద్రరావు, జస్టిస్ అమర్‌నాథ్‌ గౌడ్‌లను బదిలీ చేశారని.. తెలంగాణ న్యాయమూర్తులను ఒకరి తర్వాత ఒకరిని బదిలీపై పంపిస్తున్నారని ఆక్షేపించారు. ఈ బదిలీ న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రశ్నించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపిక చేసి కొందరిని మాత్రమే బదిలీ చేస్తున్నారని విమర్శించారు.

ఇదే విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్‌ను కలిసి వివరించారు. అనంతరం న్యాయవాదులంతా కోర్టును వీడి బయటకు రావాలని బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దాంతో కేసుల విచారణ కొనసాగుతుండగానే న్యాయవాదులు బయటకు వచ్చేశారు. న్యాయవాదులంతా విధులు బహిష్కరించడంతో సీజే ధర్మాసనంతో పాటు ఇతర న్యాయమూర్తుల వద్ద కూడా కేసుల విచారణ ఆగిపోయింది. జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీని వ్యతిరేకిస్తూ శుక్రవారం కూడా విధులు బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ న్యాయవాదులు ప్రకటించారు. హైకోర్టులో నిరసన కార్యక్రమాలు కొనసాగించనున్నారు.

అటు జస్టిస్ నిఖిల ఎస్‌. కరియెల్‌ బదిలీని వ్యతిరేకిస్తూ గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్కడ కూడా న్యాయవాదులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

First Published:  18 Nov 2022 2:10 AM GMT
Next Story