Telugu Global
Telangana

జగన్‌ ఆస్తుల కేసులో మరొకరిపై కేసు కొట్టివేత

మురళీధర్‌ రెడ్డి చార్జిషీట్‌లో 12వ నిందితుడిగా ఉన్నారు. అయితే తాను కేవలం తన విధులు మాత్రమే నిర్వహించానని క్విడ్ ప్రోకోలో తన పాత్ర లేదని మురళీధర్‌ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.

జగన్‌ ఆస్తుల కేసులో మరొకరిపై కేసు కొట్టివేత
X

జగన్‌ ఆస్తుల కేసులో మరొకరికి విముక్తి లభించింది. ఐఏఎస్ అధికారి మురళీధర్‌ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పు ఇచ్చారు.

అనంతపురం జిల్లా లేపాక్షి హబ్‌లో ఇందూ కంపెనీకి భూముల కేటాయింపు వ్యవహారంలో నాటి ఏపీఐఐసీ సీఎండీ బీపీ ఆచార్య, ఈడీగా ఉన్న మురళీధర్‌ రెడ్డి నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని, ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ భూ కేటాయింపులకు ప్రతిఫలంగా ఇందూ సంస్థ జగన్‌ కంపెనీల్లో 70 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిందని.. ఇదంతా క్విడ్ ప్రోకో అని సీబీఐ అభియోగం మోపింది.

మురళీధర్‌ రెడ్డి చార్జిషీట్‌లో 12వ నిందితుడిగా ఉన్నారు. అయితే తాను కేవలం తన విధులు మాత్రమే నిర్వహించానని క్విడ్ ప్రోకోలో తన పాత్ర లేదని మురళీధర్‌ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తనపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లేదని హైకోర్టుకు వివరించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం... మరళీధర్‌ రెడ్డి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వని అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. విధి నిర్వాహణలో భాగంగానే పిటిషనర్‌ చర్యలు ఉన్నాయని.. అలాంటి నేపథ్యంలో మురళీధర్‌ రెడ్డికి చట్టప్రకారం ఉన్న రక్షణను కాపాడాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఐపీసీ నేరాలపై ప్రాసిక్యూషన్‌కు ముందస్తు అనుమతి అవసరం లేదన్న సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. మురళీధర్ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసును కొట్టివేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

First Published:  29 Oct 2022 2:01 AM GMT
Next Story