Telugu Global
Telangana

కాళేశ్వరం ప్రాజెక్టు అత్యద్భుతం : హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్

రైతుల మేలు కోసం ఇంత గొప్ప ప్రాజెక్టును నిర్మించడం చాలా గొప్ప విషయమని ఆయన సీఎం కేసీఆర్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రశంసించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అత్యద్భుతం : హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్
X

తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత అద్భుతంగా ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. రైతుల మేలు కోసం ఇంత గొప్ప ప్రాజెక్టును నిర్మించడం చాలా గొప్ప విషయమని ఆయన సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారు. సీజే ఉజ్జల్ భుయాన్‌తో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఆదివారం పెద్దపల్లి జిల్లా నంది మేడారం సమీపంలో నిర్మించిన నంది పంప్ హౌస్‌ను సీజేతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ శ్రవణ్ కుమార్, జస్టిస్ టి. వినోద్ కుమార్, జస్టిస్ ఏ. అభిషేక్ రెడ్డి, జస్టిస్ కే. కైలాశ్ మన్, జస్టిస్ బీ. విజయ్‌సేన్ రెడ్డి, జస్టిస్ ఎం. లక్ష్మణ్, జస్టిస్. కే. శరత్, జస్టిస్ జే. శ్రీనివాసరావు సందర్శించారు.కాళేశ్వరం ఆరో ప్యాకేజీలో భాగమైన ఈ పంప్ హౌస్‌లోని సర్జ్ పూల్, జీఐఎస్ సబ్‌స్టేషన్లు, మోటార్లను పరిశీలించారు.

హైకోర్టు న్యాయమూర్తుల కోరిక మేరకు కాసేపు మోటార్లను ఆన్ చేయగా డెలివరీ సిస్టర్న్స్ నుంచి ఎగిసిపడిన నీటిని చూసి పులకించిపోయారు. ఈ నీటి పరవళ్లను చూస్తే తమకు ఎంతో సంతోషంగా ఉందని.. రైతుల కోసం ఇంత గొప్ప నీటి పారుదల ప్రాజెక్టును నిర్మించడం అభినందనీయమని న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు.

కాగా, అంతకు ముందు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో కొత్తగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సీజే ఉజ్జల్ భుయాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై మరింత గౌరవం పెంచేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. స్థానిక భాషను వాడితే న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయవచ్చని సీజే అభిప్రాయపడ్డారు.

ముంబై హైకోర్టులో స్థానిక భాష అయిన మరాఠీలోనే కోర్టు ప్రొసీడింగ్స్ ప్రచురిస్తున్నారు.దీంతో అక్కడి న్యాయ వ్యవస్థ ప్రజలకు చాలా దగ్గరైందని చెప్పారు. తనకు తెలుగంటే చాలా ఇష్టమని.. మాజీ సీఎం ఎన్టీఆర్ మాట్లాడే తెలుగు ఆకర్షణీయంగా ఉండేదని అన్నారు.

First Published:  6 Feb 2023 4:43 AM GMT
Next Story