Telugu Global
Telangana

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలకు హైకోర్టు షాక్‌

అసెంబ్లీ ఎన్నికలకు ముందు గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేసింది కేసీఆర్ సర్కార్. అయితే ఆ సమయంలో బీఆర్ఎస్‌ సర్కార్ సిఫార్సును గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలకు హైకోర్టు షాక్‌
X

తెలంగాణలో కాంగ్రెస్‌కు షాకిచ్చింది హైకోర్టు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేసింది. ఈ విషయంలో యధాతథ స్థితి కొనసాగించాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ప్రమాణస్వీకారం చేయించొద్దని ఆదేశాలు జారీ చేసింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేసింది కేసీఆర్ సర్కార్. అయితే ఆ సమయంలో బీఆర్ఎస్‌ సర్కార్ సిఫార్సును గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దీంతో దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. తమ కేసు తేలేవరకు ప్రమాణస్వీకారం చేయించొద్దని కోరారు పిటిషనర్లు. దీంతో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణస్వీకారం చేయించొద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.

ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ సోమవారమే ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. అయితే మండలి ఛైర్మన్ గుత్తా హాజరుకాకపోవడంతో ప్రమాణస్వీకారం వాయిదా పడింది. తనకు సమాచారం ఇవ్వకుండానే కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణస్వీకారానికి వచ్చారని, అనారోగ్యంగా ఉండడంతో తాను రాలేకపోయినట్లు మండలి ఛైర్మన్ గుత్తా వివరణ ఇచ్చారు. కుదిరితే ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయిస్తానని చెప్పారు. ఇంతలోనే కోర్టు ఆదేశాలు రావడంతో ప్రమాణస్వీకారానికి బ్రేక్ పడినట్లయింది.

First Published:  30 Jan 2024 10:23 AM GMT
Next Story