Telugu Global
Telangana

2022.. తెలంగాణ వైద్యరంగంలో మరో ముందడుగు

సంపదను సృష్టించడమే కాదు, ఆ సంపదను అనుభవించే ఆరోగ్యవంతమైన సమాజం కూడా ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు.

2022.. తెలంగాణ వైద్యరంగంలో మరో ముందడుగు
X

తెలంగాణ వైద్య రంగంలో అతి పెద్ద ముందడుగుకి సాక్షిగా నిలిచింది 2022. కొత్త వైద్య సదుపాయాలు తెలంగాణను మరింత మెరుగ్గా తయారు చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. జిల్లాకు ఒక వైద్య కళాశాల అనే ఆలోచన తెలంగాణ వైద్య రంగంలో ఓ విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి ఇది మరో తార్కాణం. సంపదను సృష్టించడమే కాదు, ఆ సంపదను అనుభవించే ఆరోగ్యవంతమైన సమాజం కూడా ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు. వాటి ఫలాలను భవిష్యత్ తరాలు పూర్తి స్థాయిలో అందుకునే భరోసా కల్పించారు.


ఆస్పత్రులను అప్ గ్రేడ్ చేయడం..

ఇప్పటికే ఉన్న ఆస్పత్రులను అప్ గ్రేడ్ చేయడం ద్వారా వాటిపై ప్రజలకు మరింత భరోసా కల్పించారు. గాంధీ ఆస్పత్రిలో కొత్త MRI, క్యాథ్ ల్యాబ్ ప్రారంభోత్సవంతో రూ.100 కోట్లతో మెడికల్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ అప్‌ గ్రేడ్ చేసినట్టయింది. మెహిదీ నవాజ్ జంగ్ (MNJ) క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ సంరక్షణ సౌకర్యాలు అప్‌ గ్రేడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. 300 పడకల బ్లాక్ నూతనంగా నిర్మించింది. అత్యాధునిక పరికరాలు సమకూర్చింది, 8 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్‌ లు ఏర్పాటు చేశారు.



ఫీవర్‌ ఆస్పత్రి, కోటి ఈఎన్టీ, చెస్ట్‌ ఆస్పత్రి విస్తరణ పనులు పూర్తయ్యాయి. ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ వార్డును అప్‌ గ్రేడ్ చేశారు. ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. మేడ్చల్‌ లోని చైల్డ్ హెల్త్ కేర్ యూనిట్ అప్‌గ్రేడ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పర్యవేక్షించడానికి కోటిలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ మానిటరింగ్ యూనిట్‌ ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా రాష్ట్రంలో చాలా పి.హెచ్.సి. లను ఏరియా ఆస్పత్రులుగా అప్ గ్రేడ్ చేశారు.

కొత్త ఆస్పత్రుల ప్రారంభం..

ఉన్న వాటిని ఆధునీకరించుకోవడంతోపాటు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణం కూడా ఈ ఏడాది తెలంగాణలో వేగవంతమైంది. ములుగు, మేడ్చల్‌, కొడంగల్‌, మంథనిలో 50 పడకల మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ హాస్పిటల్స్‌ (MCH) ప్రారంభించారు. భీమ్‌ గల్‌, మెదక్‌, పెద్దపల్లి, మంచిర్యాల, కొత్తగూడెం, వనపర్తిలో 100 పడకల MCH లు ప్రారంభించారు. జగిత్యాలలో 260 పడకలతో, కోయిలకొండలోని బాలానగర్‌ లో 30 పడకలతో MCHలు మొదలు పెట్టారు. వనపర్తిలో 20 పడకల స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (SNCU) ని ప్రారంభించారు. వనస్థలిపురం, భూపాలపల్లిలో కొత్త ఏరియా ఆసుపత్రులను ప్రారంభించారు.

వరంగల్‌ లో 50 పడకలతో పీడియాట్రిక్‌ ఐసీయూని ప్రారంభించారు. ఆదిలాబాద్ రిమ్స్ (రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) 210 పడకలు, 41 ఐసీయూలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారింది. బాన్సువాడలో నర్సింగ్ కాలేజీ అందుబాటులోకి వచ్చింది.

భవిష్యత్తు కోసం వైద్య సదుపాయాల విస్తరణ..

హైదరాబాద్ లోని మేడ్చల్‌, సరూర్‌ నగర్‌, సనత్‌ నగర్‌ లో మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు (టిమ్స్‌) ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.2,679 కోట్లతో ఈ ఆస్పత్రులు నిర్మిస్తున్నారు. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై భారం తగ్గుతుంది. వరంగల్‌ లో కూడా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. మహబూబ్‌ నగర్, హుస్నాబాద్, మంథని, మహబూబాబాద్, పర్కల్, నిర్మల్, సత్తుపల్లిలో ఆసుపత్రులకు శంకుస్థాపనలు చేశారు.

వైద్య విద్య

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి కాలేజీకి 300 పడకల ఆసుపత్రిని అనుసంధానం చేస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 159 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపించింది. కేంద్రం వివక్ష చూపిస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రయోజనాలకోసం రాజీపడబోనంటోంది. 2022 నవంబర్ 15న కొత్తగూడెం, రామగుండం, నాగర్‌ కర్నూల్, వనపర్తి, జగిత్యాల, మంచిర్యాల, మహబూబాబాద్‌లో, సంగారెడ్డిలో 8 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కాగా, రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 12కి చేరుకుంది. పెరుగుతున్న వైద్య సౌకర్యాలు, మెరుగవుతున్న వైద్య సేవలతో తెలంగాణ భావి తరం ధీమాగా ఉండేందుకు బాటలు పరుస్తోంది కేసీఆర్ ప్రభుత్వం.




First Published:  31 Dec 2022 1:45 AM GMT
Next Story