Telugu Global
Telangana

తాయత్తు కట్టుకోవడం వల్లే ఈ స్థాయిలో ఉన్నా.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు

సోమవారం ఖమ్మం జిల్లాలో జరిగిన ఇఫ్తార్ విందు వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పుడు తాను అనారోగ్యంతో ఉండగా తాయత్తు కట్టడం వల్లే బతికానంటూ వ్యాఖ్యలు చేశాడు.

తాయత్తు కట్టుకోవడం వల్లే ఈ స్థాయిలో ఉన్నా.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తన చిత్రమైన‌ ప్రవర్తనతో, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాయత్తు మహిమతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యాడు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కరోనా సమయంలో చాలా యాక్టివ్‌గా కనిపించాడు. ఆ సమయంలో ఆయనకు కొంత గుర్తింపు వచ్చింది. అయితే ఆ తర్వాత ఆయన తన చిత్రమైన‌ ప్రవర్తనతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. మనం చేపట్టిన చర్యల వల్ల కరోనా తగ్గలేదని, ఏసుప్రభువు కృప వల్లే కరోనా తగ్గిపోయిందని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు విని అందరూ అవాక్కయ్యారు.

మరో సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు పితృ సమానులని.. ఆయన పాదపద్మాలు తాకడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ.. వ్యాఖ్యలు చేశాడు. ఓసారి కొత్తగూడెంలో బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా అక్కడ శ్రీనివాసరావు డీజే టిల్లు పాట పెట్టుకుని స్టెప్పులేసి విమర్శల పాలయ్యాడు.

ఇప్పుడు మరోసారి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సోమవారం ఖమ్మం జిల్లాలో జరిగిన ఇఫ్తార్ విందు వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పుడు తాను అనారోగ్యంతో ఉండగా తాయత్తు కట్టడం వల్లే బతికానంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయనపై మరోసారి విమర్శలు చెలరేగుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మూఢనమ్మకాలను ప్రోత్సహించే విధంగా హెల్త్ డైరెక్టర్ వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజలు విమర్శిస్తున్నారు. శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.

First Published:  18 April 2023 6:44 AM GMT
Next Story