Telugu Global
Telangana

ఎగబాకిన తెలంగాణ, గతం కంటే వెనుకబడ్డ ఏపీ

తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలవడంతో పాటు, ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచిందని.. సీఎం కేసీఆర్‌ దార్శనిక నాయకత్వానికి వందనాలంటూ కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

ఎగబాకిన తెలంగాణ, గతం కంటే వెనుకబడ్డ ఏపీ
X

తెలంగాణ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేందుకు, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా పనితీరులో రాష్ట్ర దూకుడును మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. నీతి ఆయోగ్ గురువారం విడుదల చేసిన ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణ ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. గతసారి నాలుగో స్థానంలో ఉండగా ఇప్పుడు మరింత మెరుగుపడి రెండో స్థానానికి వచ్చింది తెలంగాణ‌.

ఇండెక్స్‌లో తొలి స్థానంలో కర్నాటక రాష్ట్రం నిలిచింది. గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ ఇండెక్స్ ఆధారంగా ఇండియ‌న్ ఇన్నోవేష‌న్ ఇండెక్స్‌ను రూపొందించారు. మూడ‌వ సారి నీతి ఆయోగ్ ఈ సూచీల‌ను విడుదల చేయగా.. కర్నాటక, తెలంగాణ, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు వరుసగా ఐదు స్థానాల్లో నిలిచాయి. టాప్‌-5లోని మూడు రాష్ట్రాలు దక్షిణాదివే కావడం విశేషం. మరో దక్షిణాది రాష్ట్రం కేరళ 8వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ గతంలో ఇన్నోవేషన్ ఇండెన్స్‌లో 7 వ ర్యాంకు సాధించగా.. ఈసారి 9వ స్థానానికి పడిపోయింది.

ర్యాంకులను రూపొందించేందుకు కొలమానాలను ఎనేబులర్స్‌,పెర్ఫార్మర్స్‌ అంటూ రెండు రకాలుగా విభజించారు. పెర్ఫార్మర్స్‌ విభాగంలో తెలంగాణ ఏకంగా తొలి స్థానంలో నిలిచింది. ఏపీ 14 స్థానానికి వెళ్లిపోయింది. ఎనేబులర్స్‌ విభాగంలో తెలంగాణ 4 స్థానంలో, ఏపీ 8వ స్థానంలో నిలిచాయి.

నీతి ఆయోగ్ తన నివేదికలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రపంచంలోని ఐటీ నగరాల్లో హైదరాబాద్‌ అగ్రగామిగా, ఒక గమ్యస్థానంగా మారిందని కితాబిచ్చింది. ఉన్నత విద్యలో లక్ష జనాభాకు అడ్మిషన్ల సంఖ్య 9.7 నుంచి 15.7కు పెరిగిందని గుర్తు చేసింది. తెలంగాణలో సమర్థత, సృజనాత్మకత, నైపుణ్యం ఉన్న ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగిందని నీతి ఆయోగ్ తన నివేదికలో వివరించింది.

పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, ఇండస్ట్రీయల్ డిజైనింగ్‌లో తెలంగాణ అద్బుతమైన పురోగతిని సాధిస్తోందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. గతంతో పోలిస్తే స్టార్టప్‌ల సంఖ్య తెలంగాణలో 4,900 నుంచి 9వేలకు పెరిగిందని వివరించింది. పెట్టుబడులు పెట్టే వారికి పూర్తి భద్రత, న్యాయపరమైన రక్షణ వాతావరణం కల్పించే విషయంలోనూ తెలంగాణ అత్యుత్తమ స్కోర్‌ను సాధించింది.

నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో తెలంగాణ 2వ స్థానం సాధించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అనుసరిస్తున్న త్రీ ఐ మంత్రతో( ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రా, ఇంక్లూజివ్ గ్రోత్‌) అద్బుతమైన ఫలితాలు రావడం ఆనందంగా ఉందన్నారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో పెర్ఫార్మర్స్ విభాగంలో ఏకంగా తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలవడంతో పాటు, ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచిందని.. సీఎం కేసీఆర్‌ దార్శనిక నాయకత్వానికి వందనాలంటూ కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

First Published:  22 July 2022 1:47 AM GMT
Next Story