Telugu Global
Telangana

తెలంగాణ గ్రూప్-2 వాయిదా..

2022లో వెలువడిన గ్రూప్-2 నోటిఫికేషన్ ఇది. ఇప్పటికే ఓసారి పరీక్షలు వాయిదా పడగా, ఇది రెండో వాయిదా.

తెలంగాణ గ్రూప్-2 వాయిదా..
X

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలకోసం సన్నద్ధం అవుతున్న నిరుద్యోగులకు నిరాశ కలిగించే వార్త ఇది. ఎన్నికల కారణంగా గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. రెండు నెలలపాటు వెనక్కు వెళ్లిపోయాయి. ఇప్పటికే ఓసారి పరీక్షలు వాయిదా పడగా, ఇది రెండో వాయిదా. దీంతో గ్రూప్-2 అభ్యర్థులు నిరాశలో మునిగిపోయారు. మరోవైపు రెండు నెలలపాటు చదువుకోడానికి సమయం కలిసొచ్చిందని కొందరు సంబరపడుతున్నారు.

గ్రూప్-2 నోటిఫికేషన్ నేపథ్యం..

2022లో వెలువడిన గ్రూప్-2 నోటిఫికేషన్ ఇది. 783 పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ ఏడాది ఆగస్ట్ 29, 30 తేదీల్లో పరీక్షలు జరపాలని తొలుత నిర్ణయించారు. అయితే అనుకోకుండా ఆ పరీక్షలు వాయిదా పడ్డాయి. నవంబర్ 2,3 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఎన్నికలు అడ్డొచ్చాయి. తెలంగాణ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదలవుతుంది. నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ కోసం సిబ్బందిని సిద్ధం చేయాల్సిన పరిస్థితి. ఇటు పరీక్షలకు హడావిడిగా ఏర్పాట్లు చేయడం కుదిరేలా లేదు. దీంతో TSPSC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-2 సాధ్యాసాధ్యాలపై సమావేశం నిర్వహించింది. చివరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.





మళ్లీ ఎప్పుడంటే..?

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కష్టమని భావించిన TSPSC వాయిదా వైపే మొగ్గుచూపింది. వాయిదా వేసిన పరీక్షలను జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు గ్రూప్-2 కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనుకోకుండా 2నెలలు అదనంగా పరీక్షలకు చదువుకునే సమయం వీరికి లభించినట్టయింది.

First Published:  10 Oct 2023 5:50 PM GMT
Next Story