Telugu Global
Telangana

రైతుల ఖాతాల్లో జమ అయిన ధాన్యం కొనుగోలు డబ్బులు

అకాల వర్షాలను ముందుగానే ఊహించి పదిరోజుల ముందు నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కన్నా అధికంగా 7,034 కొనుగోలు కేంద్రాలను తెరిచామన్నారు.

రైతుల ఖాతాల్లో జమ అయిన ధాన్యం కొనుగోలు డబ్బులు
X

యాసంగి సీజన్ లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులను వారి ఖాతాల్లోకి విడుదల చేసినట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే రూ.3 వేల కోట్లు జమ చేసినట్టు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగిలో రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.

ప్రకృతి వైఫరీత్యాలు ఎదురైనప్పటికీ ధాన్యం సేకరణ చేసినట్టు తెలిపారు. ఈ నెల 20వ తేదీకల్లా మొత్తం డబ్బులను రైతులకు అందజేస్తామని చెప్పారు. యాసంగిలో గురువారం వరకు 11 లక్షల మంది రైతుల నుంచి 64.52 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. వీటి విలువ రూ. 13,264 కోట్లు ఉంటుందన్నారు.

అకాల వర్షాలను ముందుగానే ఊహించి పదిరోజుల ముందు నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కన్నా అధికంగా 7,034 కొనుగోలు కేంద్రాలను తెరిచామన్నారు. ఇప్పటికే 90 శాతానికి పైగా సేకరణ పూర్తయ్యిందని, 6143 కేంద్రాలను మూసివేసినట్లు తెలిపారు. గత సీజన్ కన్నా 15 లక్షల మెట్రిక్ టన్నులను అధికంగా సేకరించామని మంత్రి గంగుల తెలిపారు.

18 జిల్లాల్లో సంపూర్ణంగా సేకరణ జరిగిందని.. మిగతా జిల్లాల్లోనూ ఆదివారం వరకూ పూర్తి చేస్తామన్నారు. ఇంకా ఎక్కడైనా ఆలస్యంగా కోతలు కోసిన ప్రాంతాల్లో రైతుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోళ్లు చేసేందుకు వీలుగా కలెక్టర్లకు నిర్ణయాధికారం ఇచ్చామన్నారు.

First Published:  16 Jun 2023 5:41 PM GMT
Next Story