Telugu Global
Telangana

తెలంగాణ ప్రభుత్వ కృషి వల్ల తగ్గిన సిజేరియన్ ఆపరేషన్ లు.. డాటా చెప్తున్న నిజాలు

తెలంగాణలో సిజేరియన్ ప్రసవాల రేటు గత ఏడాదితో పోలిస్తే 5.44% వరకు తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టు 2021లో సిజేరియన్ డెలివరీల రేటు 62.53% ఉండగా, ఈ ఏడాది జూలై నాటికి అది 56.86%కి తగ్గింది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య మంత్రి టి హరీశ్ రావు చేప‌ట్టిన అనేక చర్యల కారణంగా సిజేరియన్ డెలివరీల రేటు తగ్గింది.

తెలంగాణ ప్రభుత్వ కృషి వల్ల తగ్గిన సిజేరియన్ ఆపరేషన్ లు.. డాటా చెప్తున్న నిజాలు
X

ఒకప్పుడు విచక్షణారహితంగా శస్త్ర చికిత్సలు చేస్తూ రోగులను దోపిడి చేయడంలో పేరు తెచ్చుకున్న తెలంగాణలో సిజేరియన్ ప్రసవాల రేటు గత ఏడాదితో పోలిస్తే 5.44% వరకు తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టు 2021లో సిజేరియన్ డెలివరీల రేటు 62.53% ఉండగా, ఈ ఏడాది జూలై నాటికి అది 56.86%కి తగ్గింది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య మంత్రి టి హరీశ్ రావు చేప‌ట్టిన అనేక చర్యల కారణంగా సిజేరియన్ డెలివరీల రేటు తగ్గింది.

2019-21 సంవత్సరానికి సంబంధించిన జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 75% కంటే ఎక్కువ మంది సిజేరియన్ ఆపరేషన్ ల‌ ద్వారా ప్రసవించారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కరీంనగర్ లో సిజేరియన్ డెలివరీల రేటు దాదాపు 95% ఉంది, ఇది జ్యోతిష్యం ఆధారంగా ప్రసవాలను ఇష్టపడే గర్భిణీ స్త్రీలు, రోగులను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల కారణంగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 62 శాతం జననాలు సిజేరియన్ ఆపరేషన్ ల‌ ద్వారానే జరిగాయని సర్వే తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం యొక్క కొత్త ప్రతిపాదన ప్రకారం, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడానికి ఆశా వర్కర్లతో సహా ఆరోగ్య సిబ్బందిని ప్రోత్సహిస్తున్నారు. సాధారణ ప్రసవాల బెంచ్‌మార్క్‌ను దాటిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ప్రభుత్వం రూ.3,000 'టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్' అందిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సాధారణ ప్రసవాలు 85%. ఉండాలి.

ప్రతి ప్రసవానికి గైనకాలజిస్ట్ లేదా మెడికల్ ఆఫీసర్ కు రూ. 1,000 ప్రోత్సాహకం, మిడ్‌వైఫ్ స్టాఫ్ నర్స్/అగ్జిలరీ నర్సింగ్ మిడ్‌వైఫరీ (ANM), లకు రూ. 1,000, ఆయాలకు రూ. 500 చెల్లించబడుతుంది. సబ్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఏఎన్‌ఎం, గర్భిణులను గుర్తించిన ఆశా వర్కర్‌లకు ఒక్కొక్కరికి రూ.250 అందజేస్తారు.

దీంతోపాటు ప్రయివేటు ఆసుపత్రుల్లో ప్రసవాలపై ప్రభుత్వం నిఘాను కూడా ప్రారంభించింది. ప్రభుత్వం ఈ-బర్త్ పోర్టల్‌ను ప్రారంభించింది, ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి సిజేరియన్ డెలివరీల వివరాలను పేర్కొంటూ పోర్టల్‌లో డెలివరీకి సంబంధించిన కీలక వివరాలను నమోదు చేయాలి. ఆసుపత్రిలో అనవసరంగా సిజేరియన్ సర్జరీ చేశారా, లేక అత్యవసరం అయితేనే చేశారా అనే విషయం తెలుసుకోవడానికి ఈ డేటాను ఆరోగ్య శాఖ సమీక్షిస్తుంది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఉన్న 80 ప్రైవేటు ఆసుపత్రుల్లో 54 ఆస్పత్రులు అనవసరంగా సిజేరియన్ శస్త్రచికిత్సలు చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ ఆసుపత్రులకు అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చారు..

ప్రక్రియ ఎలా పనిచేస్తుంది

కొత్త కార్యక్రమం ప్రకారం, ఆశా వర్కర్లు వారి ప్రాంతంలోని గర్భిణీ స్త్రీలను గుర్తించి, వారిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రెగ్యులర్ చెకప్‌ల కోసం తీసుకువెళతారు. ఈసమయంలో, వైద్యులు వారి ఆరోగ్య స్థితి ఆధారంగా రోగులను హై-రిస్క్ లేదా తక్కువ-రిస్క్ కేటగిరీ కింద వర్గీకరిస్తారు. రోగి హై-రిస్క్ కేటగిరీ కిందకు వస్తే, డెలివరీ సాధారణమా కాదా అనేది డాక్టర్లు అంచనా వేస్తారు. ఇదిలా ఉండగా, ఆశా వర్కర్లు కూడా రోగికి వారి డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్ళాలని సలహా ఇస్తారు. ముహూర్తం చూసుకొని పిల్లలను కనడం వంటి మూఢ నమ్మకాల బారిన పడకుండా గర్భిణీలను ఎడ్యుకేట్ చేస్తారు..

గర్భిణి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా, వారిని ప్రాథమిక, కమ్యూనిటీ లేదా తృతీయ కేంద్రాలు వంటి వివిధ‌ ఆసుపత్రులకు పంపుతారు. ఆరోగ్య బృందం రోగిని సాధారణ ప్రసవానికి ఒప్పించి, దానికి అవకాశం కల్పించినట్లయితే, ఆ టీంకు ప్రోత్సాహకంగా రూ. 3,000 అందుతుంది. "అధిక-రిస్క్ కింద వర్గీకరించబడిన రోగులను మెరుగైన సౌకర్యాలతో కూడిన తృతీయ కేంద్రాలలో చేరుస్తారు'' అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మొహంతి అన్నారు. ప్రత్యేక నిపుణులు ప్రసవం సాధారణమైనదా లేదా సిజేరియనా కావాలా అనేది నిర్ణయిస్తారు. అరుదైన సందర్భాల్లో, రెండవ అభిప్రాయం కూడా తీసుకుంటారు.

కాగా ''విచక్షణారహితమైన సిజేరియన్ సర్జరీల ముప్పును నిరోధించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమైనప్పటికీ, కొన్ని దిద్దుబాట్లు ఖచ్చితంగా అవసరం, మరియు ప్రక్రియను క్రమబద్ధీకరించాలి, "అని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె మహేష్ కుమార్ అన్నారు.

సిజేరియన్లను తగ్గించడానికి ప్రభుత్వం వేస్తున్న అడుగుల పట్ల సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఈ చర్యలు మరింత ఎక్కువగా, మరింత పకడ్బందీగా చేపట్టాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

First Published:  10 Oct 2022 2:24 AM GMT
Next Story