Telugu Global
Telangana

తెలంగాణలో 300 కొత్త వంతెనలను నిర్మించనున్న‌ ప్రభుత్వం

గత రెండేళ్లలో భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో అనేక రోడ్లు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రోడ్లు, కాజ్‌వేలు, కల్వర్టులు, వంతెనల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

తెలంగాణలో  300 కొత్త వంతెనలను నిర్మించనున్న‌ ప్రభుత్వం
X

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300 కొత్త వంతెనలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన నిధులను కూడా మంజూరు చేసింది.

గత రెండేళ్లలో భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో అనేక రోడ్లు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రోడ్లు, కాజ్‌వేలు, కల్వర్టులు, వంతెనల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అలాగే కొత్త వంతెనల నిర్మాణానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ రహదారులపై 300 స్థలాలను ఆర్‌అండ్‌బీ అధికారులు గుర్తించారు.

గత రెండేళ్లలో వరదల కారణంగా దాదాపు 133 వంతెనలు దెబ్బతిన్నాయని, నదులు ప్రవహించే చోట్ల 167 ప్రాంతాల్లో అవస‌రమున్నప్పటికీ వంతెనలు లేవని, రాష్ట్ర రహదారులపై విస్తృత సర్వే చేపట్టి తక్షణమే కనీసం 150 కొత్త వంతెనల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, లేనిపక్షంలో వచ్చే వర్షాకాలంలో రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. అన్ని కొత్త వంతెనలు 10 మీటర్ల నుండి 50 మీటర్ల హైట్ లో నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దాని వల్ల‌ భారీ వర్షాలు, వరదల సమయంలో వంతెనలు మునిగిపోకుండా, వంతెనల పై నుంచి నీళ్ళు పొంగి పొర్లకుండా ఉంటుందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి రూ.2,500 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణాలకు త్వరగా టెండర్లు ఖరారు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను ప్రభుత్వం కోరింది. మంజూరైన మొత్తంలో రోడ్ల మరమ్మతులకు రూ.1,865 కోట్లు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి రూ.635 కోట్లు కేటాయించారు.

First Published:  1 March 2023 2:36 AM GMT
Next Story