Telugu Global
Telangana

చల్లారని ఈ-రేస్ మంటలు.. ఐఏఎస్ అధికారికి నోటీసులు

ఫార్ములా ఈ-రేసింగ్‌ నిర్వహణకు సంబంధించి గతంలో చేసుకున్న ఒప్పందంపై వివరణ ఇవ్వాలని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ కు తెలంగాణ ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

చల్లారని ఈ-రేస్ మంటలు.. ఐఏఎస్ అధికారికి నోటీసులు
X

తెలంగాణలో ఫార్ములా ఈ-రేస్ మంటలు ఇప్పుడప్పుడే చల్లారేలా లేవు. ఈ ఏడాది జరగాల్సిన రేస్ లు రద్దయిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేసింగ్ సంస్థ ఇటీవల ప్రకటించింది. ఎంతో కష్టపడి తమ ప్రభుత్వ హయాంలో ఈ-రేస్ నిర్వహించి హైదరాబాద్ ప్రతిష్ట పెంచితే దాన్ని నాశనం చేస్తున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. ఫార్ములా ఈ-రేస్ కి సంబంధించి హెచ్ఎండీఏ నుంచి రూ.54కోట్లు ఎందుకు చెల్లించారో చెప్పాలంటూ అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ కి తాజా ప్రభుత్వం షోకాజ్ నోటీసులివ్వడం విశేషం.

ఫార్ములా ఈ-రేసింగ్‌ నిర్వహణకు సంబంధించి గతంలో చేసుకున్న ఒప్పందంపై వివరణ ఇవ్వాలని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ కు తెలంగాణ ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. అనుమతి లేకుండా ఈ-రేస్ ఒప్పందం ఎందుకు చేసుకున్నారో తెలపాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. హెచ్‌ఎండీఏ నిధులు రూ.54 కోట్లు ఎందుకు చెల్లించారో తెలపాలని, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

గత ఏడాది ఫిబ్రవరి-11న హైదరాబాద్లో సీజన్-9 పార్ములా ఈ-రేస్ జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజన్-10 జరగాల్సి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే రేస్ నిర్వహణ అట్టహాసంగా జరిగి ఉండేది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేస్ ఆగిపోయింది. కానీ రేస్ నిర్వహణకోసం హెచ్ఎండీఏ ఇప్పటికే రూ.54కోట్లు విడుదల చేసిందనే ఆరోపణలున్నాయి. అది కూడా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు నిధులు విడుదల చేశారని అంటున్నారు. 2023 అక్టోబర్‌30న ఎన్నికల కమిషన్‌ అనుమతి లేకుండానే ఈ-రేసింగ్‌ ప్రాజెక్టుకు నిధుల్ని విడుదల చేసినట్టు తేలింది. కేబినెట్‌ అమోదం లేకుండా, ఆర్థికశాఖ అనుమతులు లేకుండానే హైదరాబాద్‌ లో పార్ములా ఈ-రేస్ నిర్వహించేందుకు హెచ్ఎండీఏ ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ క్రమంలోనే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కి నోటీసులు జారీ కావడం విశేషం.

First Published:  9 Jan 2024 9:23 AM GMT
Next Story