Telugu Global
Telangana

హైదరాబాద్‌లో కొత్తగా 104 లింక్ రోడ్లు.. ట్రాఫిక్ కష్టాలు ఇక చెల్లు

Hyderabad New Link Roads: ఆధునిక సాంకేతికత ఉపయోగించి, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని, రాకపోకలకు భారం లేకుండా చేస్తున్నారు. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లింక్ రోడ్ల ఉద్దేశమని హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది.

హైదరాబాద్‌లో కొత్తగా 104 లింక్ రోడ్లు.. ట్రాఫిక్ కష్టాలు ఇక చెల్లు
X

హైదరాబాద్ మెట్రో, కొత్త ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ సమస్యలకు ఓ ప్రత్యామ్నాయం దొరికింది కానీ, గతంలో ట్రాఫిక్‌తో నగరవాసులు బాగా ఇబ్బంది పడేవారు. పెరుగుతున్న జనాభాతో ఇప్పుడున్న వసతులు కూడా రేపటికి సరిపోకపోవచ్చు. దీంతో ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం లింక్ రోడ్ల పేరుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. మిస్సింగ్ లింక్స్ ప్రాజెక్ట్స్ పేరుతో నగరంలో లింక్ రోడ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ముఖ్యంగా శివారు ప్రాంతాల వాసులకు ఈ రోడ్లు బాగా ఉపయోగపడతాయి. ఫేజ్-3 కింద రూ.2,410 కోట్లతో 104 లింక్ రోడ్లను అభివృద్ధి చేయాలని నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలోనే ఈ పనులు మొదలు కాబోతున్నాయని తెలిపారు అధికారులు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.1,160 కోట్లతో 95.47 కి.మీ మేర 72 ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం జరుగుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 10 పట్టణ స్థానిక సంస్థలలో రూ.1,250 కోట్లు ఖర్చుతో 103.45 కి.మీ మేర 32 రోడ్లు అభివృద్ధి చేయబోతున్నారు.

బండ్లగూడ జాగీర్‌, ఘట్‌ కేసర్‌, కొత్తూరు, దమ్మాయిగూడ, నాగారం, బడంగ్‌ పేట్‌, శంషాబాద్‌, ఇబ్రహీంపట్నం, మణికొండ, జవహర్‌ నగర్‌ కార్పొరేషన్ల పరిధిలో కొత్తగా నిర్మించే ఈ లింక్ రోడ్లు ఉంటాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాంతాల మధ్యదూరం తగ్గించేందుకు, ప్రభుత్వం లింక్‌, స్లిప్‌ రోడ్లు నిర్మిస్తోంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రాకపోకలకు భారం లేకుండా చేస్తోంది. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లింక్ రోడ్ల ఉద్దేశమని హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది.

గతంలో 135 లింక్ రోడ్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటి పొడవు మొత్తం 126.20 కిలోమీటర్లు. తొలి రెండు దశల్లో దాదాపు రూ.572 కోట్లతో 52.36 కిలోమీటర్ల మేర లింక్‌ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇందులో రూ.273 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మొత్తం 24 కిలోమీటర్ల పొడవైన రోడ్లు వేశారు. ఇప్పుడు ఫేజ్-3లో కొత్తగా 104 లింక్ రోడ్ల నిర్మాణం మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు అధికారులు.

First Published:  16 Nov 2022 12:00 PM GMT
Next Story