Telugu Global
Telangana

తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల టెండర్లకు అనూహ్య స్పందన

తొలి విడత 25 LMTల ధాన్యాన్ని విక్రయించడానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలపగా బిడ్లు ఆహ్వానించారు. గత నెలలో ఈ ప్రక్రియ మొదలు కాగా.. గడువు ముగిసే సమయానికి మొత్తం 54 కంపెనీలు ఆసక్తి చూపించాయి.

తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల టెండర్లకు అనూహ్య స్పందన
X

ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం మొహం చాటేసింది. అదే సమయంలో ఇక్కడ ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి, మిల్లర్లకు నిల్వ సాధ్యం కావడంలేదు. దీంతో గ్లోబల్ టెండర్లు పిలిచింది తెలంగాణ ప్రభుత్వం. తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల(LMT) ధాన్యం అమ్మకాలకు సిద్ధమైంది. ఈ గ్లోబల్ టెండర్లకు అనూహ్య స్పందన రావడం విశేషం. గత నెలలో టెండర్లు ఆహ్వానించగా.. మొత్తం 54 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.

25లాట్ల కోసం మొత్తంగా 54 సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. ఇందులో 8 లాట్లకు సంబంధించి కేవలం ఒక్కో బిడ్ మాత్రమే దాఖలైంది. మిగతా 17 లాట్లకోసం 46 సంస్థలు బిడ్లు వేశాయి. పౌరసరఫరాల సంస్థ ద్వారా ఈ ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగి (2022–23) సీజన్ లో 66.85 LMT ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా ప్రభుత్వం సేకరించింది. ఈ మొత్తం ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేయగా, కొంత భాగం అకాల వర్షాలకు తడిచిపోయింది. దీంతోపాటు మిగతా ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయడానికి మిల్లర్లు నిరాకరించడంతో బాయిల్డ్ రైస్ తయారు చేయాలనుకున్నారు. కానీ కేంద్రం బాయిల్డ్ రైస్ కి ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వం విక్రయిస్తోంది.

తొలి విడత 25 LMTల ధాన్యాన్ని విక్రయించడానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలపగా బిడ్లు ఆహ్వానించారు. గత నెలలో ఈ ప్రక్రియ మొదలు కాగా.. గడువు ముగిసే సమయానికి మొత్తం 54 కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఆయా సంస్థలను ఎంక్వయిరీ చేసి అర్హత కలవాటికి ఫైనాన్షియల్ బిడ్డింగ్ కి ఎంపిక చేస్తారు. అర్హత పొందిన సంస్థలను రేపు ఆర్థిక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేస్తుంది.

First Published:  15 Sep 2023 6:00 AM GMT
Next Story