Telugu Global
Telangana

మేడిగడ్డపై నిందలు సరికాదు.. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ

ఇన్వెస్టిగేషన్‌ పూర్తయిన తర్వాతనే అసలు కారణాలు చెప్పగలమని, ప్రస్తుతానికి కేంద్రం ఇచ్చిన నిర్ధారణలతో తాము ఏకీభవించలేకపోతున్నట్టు తెలిపింది రాష్ట్ర నీటిపారుదల శాఖ.

మేడిగడ్డపై నిందలు సరికాదు.. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
X

మేడిగడ్డపై నిందలు సరికాదు.. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ

మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ వ్యవహారం తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణం అయింది. ఈ వ్యవహారాన్ని హైలైట్ చేస్తూ ప్రభుత్వంపై నిందలేస్తూ కాంగ్రెస్, బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన మొదలు పెట్టింది. రాజకీయ కారణాలతో నిందలు వేయడం సరికాదని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తొందరపాటుతో ఆరోపణలు చేయడం సరికాదంది. కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ పై కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి 20 డాక్యుమెంట్లు అడిగితే కేవలం 11 మాత్రమే ఇచ్చారంటూ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈమేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. బ్యారేజ్ పరిశీలన, అనంతరం జరిగిన సమావేశంలో డ్యాం సేఫ్టీ అధికారులు అడిగిన అన్ని డాక్యుమెంట్లనూ చూపించామని ఆ లేఖలో రజత్ కుమార్ పేర్కొన్నారు. 20 డాక్యుమెంట్లు పంపాలని గత నెల 27న లేఖ రాగా, పనిదినాలు కాకపోయినా 29న సాయంత్రానికి 17 పంపామని వివరించారు. మిగిలిన మూడింటిని కూడా నవంబర్-1న పంపించామన్నారు. ఈ డాక్యుమెంట్లు చూసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై తొందరపాటుతో ఆరోపణలు చేశారన్నారు.

బ్యారేజీ పునరుద్ధరణ పనులు వేగంగా, పటిష్ఠంగా జరగడానికి రాష్ట్ర ఏజెన్సీలతో కేంద్రం సహకరించాలని ఆ లేఖలో కోరారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై జాతీయ డ్యాం సేఫ్టీ అధికారుల బృందం ఇచ్చిన నివేదికపై నీటిపారుదలశాఖ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ లేఖ రాశారు. పునాదులు, దానికి సంబంధించిన స్ట్రక్చర్లను సరిగా పరిశీలించిన తర్వాతనే కచ్చితమైన కారణాలను తెలుసుకోగలం అని చెప్పారు. ప్రస్తుతం ఈ పని జరుగుతోందని, నీటిని మళ్లించడానికి ఏజెన్సీ కాఫర్‌ డ్యాం నిర్మాణం చేపట్టిందని తెలిపారు. ఇన్వెస్టిగేషన్‌ పూర్తయిన తర్వాతనే అసలు కారణాలు చెప్పగలమని, ప్రస్తుతానికి కేంద్రం ఇచ్చిన నిర్ధారణలతో తాము ఏకీభవించలేకపోతున్నట్టు తెలిపింది.

First Published:  5 Nov 2023 4:17 AM GMT
Next Story