Telugu Global
Telangana

మళ్లీ తమిళి'సై'.. పెండింగ్ లో 12 బిల్లులు

ఆర్టీసీ బిల్లు సభ ఆమోదానికి ముందే వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు సభ ఆమోదం తెలిపిన తర్వాత కూడా వీటికి మోక్షం కలగకపోవడం విశేషం. వారం రోజులుగా ఈ బిల్లులు రాజ్ భవన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి.

మళ్లీ తమిళిసై.. పెండింగ్ లో 12 బిల్లులు
X

బిల్లుల్ని పెండింగ్ లో పెట్టి ప్రభుత్వ సహనాన్ని పరీక్షించడం మళ్లీ మొదలైంది. తాజాగా వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీ, మండలి ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై ఆమోదముద్ర వేయకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నారు తమిళిసై. వీటిని ఆమోదిస్తే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి చట్టరూపంలోకి తీసుకు రావాల్సి ఉంటుంది. చట్టసభలు ఆమోదించినా వాటికి గవర్నర్ రాజముద్ర పడకపోవడం విశేషం.

పాతవి 4, కొత్తవి 8..

గతంలో గవర్నర్ తమిళిసై 3 బిల్లుల్ని తిప్పి పంపగా, ఒక బిల్లుని తిరస్కరించారు. ఆ నాలుగు బిల్లుల్ని మరోసారి అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ వద్దకు పంపించారు.

తెలంగాణ మున్సిపల్‌ బిల్లు–2022

తెలంగాణ ప్రైవేటు వర్సిటీల బిల్లు–2022

రాష్ట్ర పంచాయతీరాజ్‌ బిల్లు–2023

తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ బిల్లు–2022

వీటికి రెండోసారి సభ ఆమోదం తెలిపి రాజ్ భవన్ కి పంపించింది.

కొత్తవి 8

తెలంగాణ పంచాయతీరాజ్‌ (రెండో సవరణ) బిల్లు–2023

తెలంగాణ పంచాయతీరాజ్‌ (మూడో సవరణ) బిల్లు - 2023

తెలంగాణ మున్సిపాల్టీల (రెండో సవరణ) బిల్లు -2023

తెలంగాణ జీఎస్టీ చట్ట సవరణ బిల్లు -2023

తెలంగాణ స్టేట్‌ మైనారిటీస్‌ కమిషన్‌ బిల్లు -2023

ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లు -2023

టిమ్స్‌ వైద్య సంస్థల బిల్లు -2023

తెలంగాణ ఆర్టీసీ బిల్లు - 2023

వీటిలో ఆర్టీసీ బిల్లు సభ ఆమోదానికి ముందే వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు సభ ఆమోదం తెలిపిన తర్వాత కూడా వీటికి మోక్షం కలగకపోవడం విశేషం. వారం రోజులుగా ఈ బిల్లులు రాజ్ భవన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వీటి విషయంలో గవర్నర్‌ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉండటంతో.. ఆలోగానే బిల్లులను అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు గవర్నర్ కోటాలో నియమించే ఇద్దరు ఎమ్మెల్సీల విషయంలో కూడా రాజ్ భవన్ నాన్చుడు ధోరణిలో ఉంది. గతంలో కౌశిక్ రెడ్డి నియామకం కూడా ఇలాగే ఇబ్బందుల్లో పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ నియామకాలపై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొత్తమ్మీద మరోసారి గవర్నర్ పెండింగ్ వ్యవహారం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

First Published:  13 Aug 2023 4:32 AM GMT
Next Story