Telugu Global
Telangana

రాళ్లేస్తే బిల్డింగ్ కట్టుకుంటా.. నా రక్తంతో చరిత్ర రాస్తా

తనపై రాళ్లేస్తే కోట కట్టుకుంటానని, తనపై సూదులు విసిరితే.. అవి గుచ్చుకున్నప్పుడు వచ్చిన రక్తంతో చరిత్ర పుస్తకం రాసుకుంటానని చెప్పారు. తానెప్పుడూ ధైర్యంగానే ఉంటానని, ఏదో జరిగిపోతుందనే భయం తనకెప్పుడూ లేదన్నారు తమిళిసై.

రాళ్లేస్తే బిల్డింగ్ కట్టుకుంటా.. నా రక్తంతో చరిత్ర రాస్తా
X

తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుని వెళ్తానన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారిన సందర్భంలో రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో పలువురు మహిళా ప్రముఖులతో జరిగిన మీటింగ్ లో ఆమె పాల్గొన్నారు. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.


తనకు పువ్వులిస్తే సంతోషంగా స్వీకరిస్తానని, తనవైపు చూసి మొహం తిప్పుకుంటే.. తాను అంతకంటే వేగంగా వెనుతిరిగి వెళ్లిపోతానని అన్నారు గవర్నర్ తమిళిసై. తనపై రాళ్లేస్తే కోట కట్టుకుంటానని, తనపై సూదులు విసిరితే.. అవి గుచ్చుకున్నప్పుడు వచ్చిన రక్తంతో చరిత్ర పుస్తకం రాసుకుంటానని చెప్పారు. తానెప్పుడూ ధైర్యంగానే ఉంటానని, ఏదో జరిగిపోతుందనే భయం తనకెప్పుడూ లేదన్నారు తమిళిసై.

గత 27 ఏళ్లుగా మహిళా బిల్లు గురించి మాట్లాడుతున్నారు కానీ అమలు కాలేదని, ఓ మహిళా రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు గవర్నర్ తమిళిసై. అవకాశం వచ్చినప్పుడు పురుషులతో పోలిస్తే 20 రేట్లు ఎక్కువగా పని చేస్తే కానీ మహిళకు ఉందన్నారు. రాజకీయాలపై మక్కువతోనే తనకు ఎంతగానో ఇష్టమైన వైద్యవృత్తిని కూడా పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు గవర్నర్‌. రాజకీయాల్లో ఇప్పటి వరకు పురుషాధిక్యత ఎక్కువని, ఇకపై మహిళా పవర్ కనిపిస్తుందన్నారు.

ఈ వ్యాఖ్యల మర్మం ఏంటి..?

ప్రొటోకాల్ ఇవ్వకపోయినా పర్లేదు, రాళ్లేసినా పర్లేదు, విమర్శించినా డోంట్ కేర్ అంటూ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాన్ని గవర్నర్ అడ్డుకున్నారు, అంతకు ముందు ప్రభుత్వ నిర్ణయాలను పలుమార్లు ఆమె పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

First Published:  30 Sept 2023 10:30 AM GMT
Next Story