Telugu Global
Telangana

నకిలీ సర్టిఫికెట్లను కనిపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచన..

ఈ పోర్టల్ లో వివిధ రాష్ట్రాల యూనివర్శిటీలలో సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థుల వివరాలను పొందుపరిచారు. గత 12ఏళ్లకు సంబంధించిన రికార్డులను అప్ డేట్ చేశారు.

నకిలీ సర్టిఫికెట్లను కనిపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచన..
X

నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలకు అప్ల‌య్ చేసినా, ప్రైవేటు ఉద్యోగాల్లో చేరినా, క్షణాల్లో దాని వివరాలు పసిగట్టవచ్చు. అది అసలా.. నకిలీయా అని తేల్చేయవచ్చు. దీనికి సంబంధించిన ఓ పోర్టల్ ను తెలంగాణ విద్యాశాఖ అందుబాటులోకి తెస్తోంది. దీన్ని రేపు మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు.

అసలా నకిలీయా తేల్చేస్తుంది..

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్న ఈ పోర్టల్ లో మనం చెక్ చేయాల్సిన సర్టిఫికెట్ నెంబర్ సహా దాన్ని స్కాన్ చేసి అప్ లోడ్ చేస్తే అది అసలా.. నకిలీయా అనేది తేలిపోతుంది. దీనికి సంబంధించి ఈ పోర్టల్ లో వివిధ రాష్ట్రాల యూనివర్శిటీలలో సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థుల వివరాలను పొందుపరిచారు. గత 12ఏళ్లకు సంబంధించిన రికార్డులను అప్ డేట్ చేశారు. ముందు ముందు మరిన్ని సంవత్సరాల వివరాలు పొందుపరుస్తారు. ఈ లిస్ట్ లో పేరు ఉంటే ఆ సర్టిఫికెట్ ఒరిజినల్, లేదంటే డూప్లికేట్ అని తేలిపోయినట్టే.

అందరికీ ఉపయోగం..

తెలంగాణ ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ పోర్టల్ అన్ని రాష్ట్రాల వారికి అందుబాటులో ఉంటుందని, ఉపయోగపడుతుందని అంటున్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి. అయితే ఈ పోర్టల్ ఆధారంగా నియామకాలు చేపట్టడం, చేపట్టకపోవడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల, ప్రైవేటు కంపెనీల సొంత అభిప్రాయం అని తేల్చి చెప్పారాయన. ఇక తెలంగాణ ప్రభుత్వం మాత్రం నియామకాలకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఈ పోర్టల్ ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటుంది.

First Published:  17 Nov 2022 11:54 AM GMT
Next Story