Telugu Global
Telangana

రూ. 30,000 కోట్ల విలువైన స్థలాల కోసం తెలంగాణ సర్కారు పోరాటం

రంగారెడ్డి జిల్లా పరిధిలో దాదాపు రూ. 30వేల కోట్ల విలువైన 3 వేల ఎకరాలను తిరిగి ప్రభుత్వ పరం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

రూ. 30,000 కోట్ల విలువైన స్థలాల కోసం తెలంగాణ సర్కారు పోరాటం
X

తెలంగాణ ప్రభుత్వం విలువైన భూములను కాపాడుకునే ప్రయత్నంలో పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారు భూములను కబ్జాకారుల చేతి నుంచి విడిపించేందుకు కోర్టును ఆశ్ర‌యించ‌బోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టు పక్కల అన్యాక్రాంతమైన అత్యంత విలువైన భూములు తిరిగి చేజిక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

ఇటీవల సినీ నిర్మాత దగ్గుబాటి రామనాయుడు కుటుంబీకుల చేతిలో ఉన్న 25 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రూ. 2 వేల కోట్ల విలువైన ఈ భూమి కేవలం ఆవగింజంత మాత్రమే అని.. ప్రభుత్వానికి చెందిన వందల ఎకరాలు ఇప్పటికీ కబ్జాదారుల చేతుల్లోనే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో దాదాపు రూ. 30వేల కోట్ల విలువైన 3 వేల ఎకరాలను తిరిగి ప్రభుత్వ పరం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. రామానాయుడు కుటుంబం లాంటి కేసులు చాలా ఉన్నాయని.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న విలువైన భూములను తిరగి ప్రభుత్వపరం చేయడానికి నడుం బిగించినట్లు రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ చెప్తున్నారు.

హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం గత రెండు దశాబ్దాల్లోనే ఎన్నోరెట్ల అభివృద్ధి చెందింది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, హఫీజ్‌పేట, ఖానామెట్, రాయ్‌దుర్గం, మంచిరేవుల, పుప్పాలగూడ, శంషాబాద్, గండిపేట్, గచ్చిబౌలి, గోపన్‌పల్లి ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమ‌య్యాయి. ఈ ప్రాంతాల్లో ఎకరం ధర మార్కెట్ విలువ ప్రకారం రూ. 5 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకు పలుకుతోంది. వీటిని అక్రమార్కుల నుంచి విడిపించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.

ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న కొందరు నకిలీ పత్రాల సాయంతో ఇతరులకు విక్రయించినట్లు కూడా గుర్తించారు. వీళ్ల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడంలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొంత మంది అక్రమార్కులు కావాలనే ఇతరుల పేరు మీదకు యాజమాన్య హక్కులను మార్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. వీటిని కోర్టు ముందు సబ్మిట్ చేసి తమకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నట్లు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో అనేక ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ భూములే. అయితే కొంత మంది రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని కలెక్టర్ అమోయ్ కుమార్ అంటున్నారు. ఈ భూములను రక్షించడానికి ప్రత్యేక లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సుప్రీంకోర్టులో కూడా పోరాడటానికి ఈ లీగల్ టీమ్‌ను సిద్ధం చేశామని అన్నారు.

మంచిరేవుల పరిధిలోని సర్వే నెంబర్ 393/1 నుంచి 393/20 వరకు ఉన్న 142 ఎకరాలను అప్పట్లో గ్రేహౌండ్స్‌కు కేటాయించారు. కానీ అందులో చాలా వరకు కబ్జాకు గురైంది. రాయదుర్గం పరిధిలోని సర్వే నెంబర్ 46 కింద 84 ఎకరాలు, మియాపూర్ పరిధిలోని సర్వే నెంబర్లు 100, 101 పరిధిలోని 550 ఎకరాలు, హైదర్‌నగర్ పరిధిలోని సర్వే నెంబర్ 172లోని 96 ఎకరాల భూములు కాపాడటానికి గట్టి ప్రయత్నం చేస్తున్నామన్నారు. వీటిని రక్షించడమే కాకుండా, కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిపారు.

హఫీజ్‌పేట ప్రాంతంలో ప్రభుత్వానికి 450 ఎకరాలు ఖాళీ స్థలం ఉన్నది. అయితే ఇప్పుడు దాంట్లో కేవలం 100 ఎకరాలు మాత్రమే ఖాళీగా కనపడుతోంది. ప్రభుత్వ భూమిని కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా అమ్మేశారు. ఈ భూమిపై ప్రభుత్వం కోర్టులో పోరాడుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న లెక్కలను బట్టి మంచిరేవులలో 142 ఎకరాలు, మంచిరేవుల గ్రామం 114, ఘన్సీమియాగూడ 300, సుల్తాన్‌పల్లి 190, మియాపూర్ 550, గోపన్‌పల్లి 200, హఫీజ్‌పేట 450, రాయదుర్గం 84, పుప్పాలగూడ 198, ఖానామెట్ పరిధిలో 25 ఎకరాల భూముల విలువే దాదాపు రూ. 30 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

First Published:  18 July 2022 7:32 AM GMT
Next Story