Telugu Global
Telangana

2 లక్షల రుణమాఫీ ఎప్పుడంటే..

గతంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌.. రుణమాఫీ చేసేందుకు అనేక కొర్రీలు పెట్టిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

2 లక్షల రుణమాఫీ ఎప్పుడంటే..
X

రైతు రుణమాఫీపై రేవంత్ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే బ్యాంకులతో దీనిపై చర్చించారు.

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ ఎన్నికలు పూర్తయిన వెంటనే రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.

గతంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌.. రుణమాఫీ చేసేందుకు అనేక కొర్రీలు పెట్టిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 40 లక్షల మంది రైతులకు రూ. 25,916 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటే.. కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని కొర్రీ పెట్టి లబ్ధిదారుల సంఖ్యను దారుణంగా కుదించిందని చెబుతోంది.

ఐదేళ్ల పాటు విడతల వారీగా రుణమాఫీ నిధులు విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం.. చివరకు కేవలం 23 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసినట్టుగా అధికారులు తేల్చారు. దాదాపు 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ సొమ్ము ఎగవేసినట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలోలాగా తప్పులు జరగకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసే ప్రతిపాదనలపై మొదటి వంద రోజుల్లోనే కసరత్తు మొదలు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

First Published:  28 March 2024 6:29 AM GMT
Next Story