Telugu Global
Telangana

చేతులెత్తేసిన కేంద్రం.. రేపటి నుంచి బూస్టర్ డోసు పంపిణీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి (ఏప్రిల్ 19) బూస్టర్ డోసును పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

చేతులెత్తేసిన కేంద్రం.. రేపటి నుంచి బూస్టర్ డోసు పంపిణీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
X

కరోనా వైరస్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. రెండున్నర ఏళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్.. ఇండియాలో తగ్గు ముఖం పట్టిందని అందరూ భావించారు. కానీ ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లతో వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతోంది. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టింది. 24 గంటల వ్యవధిలో 41 మంది కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తెలంగాణ ప్రభుత్వం టీకాలను సిద్ధం చేస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి (ఏప్రిల్ 19) బూస్టర్ డోసును పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ సరఫరాను నిలిపివేయడంతో స్వయంగా తెలంగాణ ప్రభుత్వం టీకాలు కొని ప్రజలకు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నది. వ్యాక్సిన్లు కావాలని రిక్వెస్టు చేసినా.. కేంద్రం చేతులెత్తేయడంతో.. తొలి విడతగా కార్బెవ్యాక్స్ 5 లక్షల డోసులు తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొని వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బయోలాజికల్-ఈ అనే సంస్థ కార్బెవ్యాక్స్‌ను ఉత్పత్తి చేస్తోంది.

బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల్లో కార్బెవ్యాక్స్‌ను బూస్టర్ డోసుగా పంపిణీ చేయనున్నారు. మొదటి రెండు డోసులు కోవాక్సిన్ లేదా కోవీషీల్డ్ తీసుకున్నా.. బూస్టర్ డోసుగా కార్బెవ్యాక్స్‌ను తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముందుగా వెళ్లిన వారికి ముందు వ్యాక్సిన్ ఇచ్చేలా వైద్య సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. అందరికీ మూడో బూస్టర్ డోసు అందుతుందని అధికారులు అంటున్నారు. రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ సమాంతరంగా జరుగుతుందని అధికారులు తెలిపారు.

ఇక రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజర్లు వాడాలని సూచిస్తోంది. గుంపులుగా గుమి కూడే చోట ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. సాధ్యమైనంత త్వరగా బూస్టర్ డోసు తీసుకొని వైరస్ బారి నుంచి రక్షించుకోవాలసి సూచిస్తున్నారు.

First Published:  18 April 2023 1:33 PM GMT
Next Story