Telugu Global
Telangana

త్వరలో బీసీ బంధు.. స్పష్టం చేసిన మంత్రి

దళిత బంధు, గిరిజన బంధు లాగే.. బీసీ బంధును అమలు చేసి, అనేక మందికి ఆర్థిక భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

త్వరలో బీసీ బంధు.. స్పష్టం చేసిన మంత్రి
X

తెలంగాణ ప్రభుత్వం బీసీ బంధు పథకం అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. దళిత బంధు, గిరిజన బంధు లాగే.. బీసీ బంధును అమలు చేసి, అనేక మందికి ఆర్థిక భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 80 కోట్ల జనాభా ఉన్న బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేక పోతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు.

ముదిరాజుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. మత్స్యకారుల కోసం గత ప్రభుత్వలు పెద్దగా ఖర్చు చేయలేదని, అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా రూ. 5వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో ముదిరాజ్ భవనం ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ రూ. 500 కోట్ల విలువైన భూమిని కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉచిత చేప పిల్లల పంపిణీతో రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, దాని వల్ల మత్స్యకారుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని అన్నారు. కుల వృత్తుల ద్వారా జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు.

హైదరాబాద్ రవీంద్ర భారతిలో మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమ కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో బీసీల కోసం అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోందని ఆయన చెప్పారు. అనేక రంగాల్లో రాణిస్తున్న ముదిరాజ్ ప్రతినిధులను ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానించారు.

First Published:  22 Nov 2022 1:57 AM GMT
Next Story