Telugu Global
Telangana

గుడ్లకు రంగులు వేయనున్న తెలంగాణ సర్కార్.. ఎందుకో తెలుసా?

రాష్ట్రంలోని అంగన్‌వాడీలకు ఏజెన్సీల ద్వారా ప్రతీ 10 రోజులకు ఒకసారి గుడ్లు సరఫరా అవుతాయి. నెలకు మూడు సార్లు గుడ్లను ప్రతీ అంగన్ వాడీకి గుడ్లను చేరుస్తారు.

గుడ్లకు రంగులు వేయనున్న తెలంగాణ సర్కార్.. ఎందుకో తెలుసా?
X

తెలంగాణ ప్రభుత్వం ఇకపై రంగులు వేసిన గుడ్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో.. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గుడ్లను పంపిణీ చేస్తున్నారు. అయితే, చాలా ప్రాంతాల్లో ఆ గుడ్లు లబ్దిదారులకు చేరకుండా.. పక్కదోవ పడుతున్నట్లు గుర్తించారు. దీంతో ఇకపై ప్రతీ గుడ్డుకు లెక్క ఉండాలని నిర్ణయం తీసుకున్నది. అంగన్‌వాడీల గుడ్లు బయటకు వెళ్లకూడదని నిర్ణయించింది. అందుకే ఇకపై ప్రతీ గుడ్డుకు రంగులు వేయనున్నది.

రాష్ట్రంలోని అంగన్‌వాడీలకు ఏజెన్సీల ద్వారా ప్రతీ 10 రోజులకు ఒకసారి గుడ్లు సరఫరా అవుతాయి. నెలకు మూడు సార్లు గుడ్లను ప్రతీ అంగన్ వాడీకి గుడ్లను చేరుస్తారు. ఇకపై వారానికి ఒక రంగుతో పాటు గుడ్డుపై జోన్ నెంబర్‌ను ముద్రిస్తారు. ఆయా రంగుల గుడ్లను నిర్ణీత సమయంలోగా వాడేలా ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. తొలి విడతలో పీకాక్ బ్లూ, రెండో విడతలో ఎరుపు, మూడో విడతలో ఆకుపచ్చ రంగు గుడ్లు ప్రతీ నెల సరఫరా కానున్నాయి.

గుడ్ల పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుడ్లకు రంగులు వేయడమే కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల మేరకు గుడ్లను పంపిణీ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీలపైనే పెట్టింది. ప్రతీ గుడ్డు 45 నుంచి 52 గ్రామాలు ఉండాలి. 10 గుడ్లను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. అయితే వాటి బరువు 450 గ్రాముల నుంచి 525 గ్రాముల వరకు ఉండాలని పేర్కొన్నది. పగిలిన గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సరఫరా చేయకూడదు. ఇక గుడ్డు పరిమాణం 1600 మిల్లీ మీటర్ల డయామీటర్, 3 మిల్లీ మీటర్ల ఎత్తు ఉండాలని స్పష్టం చేసింది.

అంగన్‌వాడీలకు సరఫరా చేసే గోదాముల్లో నాణ్యత పరీక్షించే ల్యాబ్ తప్పని సరిగా ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు పరీక్షించి.. నాణ్యతను రిజిస్ట్రర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నాణ్యత లేని గుడ్లను సరఫరా చేసే ఏజెన్సీల కాంట్రాక్టును రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. అంగన్‌వాడీ గుడ్లు బయట మార్కెట్‌లోకి వస్తే ఇకపై సులభంగా గుర్తు పట్టే అవకాశాలు ఉన్నాయి.

First Published:  20 Jun 2023 11:31 AM GMT
Next Story