Telugu Global
Telangana

హెచ్‌సీఏలో అవకతవకలపై సుప్రీం కమిటీకి నివేదిక ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

హెచ్‌సీఏలో జరుగుతున్న విషయాలపై సమగ్ర నివేదికను సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి అందజేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

హెచ్‌సీఏలో అవకతవకలపై సుప్రీం కమిటీకి నివేదిక ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
X

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో జరుగుతున్న అవకతవకలు, రాజకీయ ఆధిపత్య పోరుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత కొంత కాలంగా మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, ఇతర పాలక కమిటీ సభ్యుల మధ్య వివాదాలు నెలకొన్నాయి. దీంతో హెచ్‌సీఏకు జరగాల్సిన ఎన్నికలు కూడా నిలిచిపోయాయి. ఇరు వర్గాల ఆధిపత్య పోరు క్రికెటర్లకు శాపంగా మారింది. హైదరాబాద్ జట్టు ఎంపికలో కూడా అవకతవకలు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.

హెచ్‌సీఏ వ్యవహారాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే హెచ్‌సీఏలో జరుగుతున్న విషయాలపై సమగ్ర నివేదికను సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి అందజేశామని ఆయన అన్నారు. హెచ్‌సీఏకు అనుబంధంగా జిల్లాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అసోసియేషన్‌లో పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఉన్న హెచ్‌సీఏ ప్యానల్‌పై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఈ కేసులన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోందని.. తప్పు చేసిన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, హెచ్‌సీఏలో ముదురుతున్న వివాదాలు అసోసియేషన్ మనుగడకు ప్రమాదకరంగా మారింది. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడం కూడా అనుమానమే అనే చర్చ జరుగుతోంది. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ అన్నీ తానై వ్యవహరించారు. అప్పట్లో టికెట్ల కొనుగోలు వ్యవహారంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కున్నారు. సరైన ప్రణాళిక లేకుండా ఆఫ్ లైన్ టికెట్లు విక్రయించడంతో పలువురికి గాయాలు అయ్యాయి.

అప్పట్లోనే హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి విజయానంద్ సహా పలువురు అజారుద్దీన్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలక మండలి సభ్యులు సమావేశం ఏర్పాటు చేయగా.. అజారుద్దీన్ ఉప్పల్ స్టేడియంకు తాళాలు వేసుకున్నారు. అప్పుడు స్టేడియం బయటే సభ్యులు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ పరిణామాలపై ఇంత వరకు బీసీసీఐ గానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు. తాజాగా, హెచ్‌సీఏ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. హెచ్‌సీఏ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ కూడా దెబ్బతింటోందని భావించింది. అందుకే ఇకపై ఈ విషయంపై బీసీసీఐకి కూడా లేఖ రాయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

First Published:  11 Feb 2023 2:08 PM GMT
Next Story