Telugu Global
Telangana

మరి యూపీ సంగతేంటి..? అంటున్న తెలంగాణ ప్రభుత్వం

అయితే కేంద్ర సర్వీసుల్లో అధికారుల కొరత ఉందంటున్న కేంద్రం.. బీజేపీ ఏలుబడిలోని రాష్ట్రాల్లో భారీగా అదనంగా అధికారులు ఉన్నా వారి విషయంలో మాత్రం ఒత్తిడి తేవడం లేదు.

మరి యూపీ సంగతేంటి..? అంటున్న తెలంగాణ ప్రభుత్వం
X

మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు, హక్కుల్లోకి కూడా పరోక్షంగా వేలు పెడుతోంది. కీలమైన ఐఏఎస్‌, ఐపీఎస్‌లనూ తమ అజమాయిషీలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు చుక్కలు చూపించాలని కుట్ర చేస్తోందన్న ఆరోపణ విపక్ష పార్టీల ఏలుబడి రాష్ట్రాల నుంచి వస్తోంది.

కేంద్ర సర్వీసుల్లో అధికారులు కొరత ఉంది కాబట్టి డిప్యూటేషన్‌పై సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లను పంపించండి అని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం, ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు పదోన్నతలు ఇవ్వాలన్నా, బదిలీ చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలంటూ రకరకాల నియంత్రణలు విధిస్తోంది. బదిలీలు, పదోన్నత అంశాన్ని ప్రభావితం చేసే శక్తి కేంద్రం చేతిలో ఉంటే అప్పుడు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్టు కాకుండా తాము చెప్పినట్టు తలూపుతారన్నది కేంద్రం ఆలోచనగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కేంద్ర సర్వీసుల్లో అధికారుల కొరత ఉందంటున్న కేంద్రం.. బీజేపీ ఏలుబడిలోని రాష్ట్రాల్లో భారీగా అదనంగా అధికారులు ఉన్నా వారి విషయంలో మాత్రం ఒత్తిడి తేవడం లేదు. కేంద్రం విధానాలపై పోరాటం చేస్తున్న తెలంగాణ సర్కార్‌ ఈ వ్యవహారంలోనూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతోంది. యూపీలో ఉండాల్సిన వారి కంటే ఏకంగా 175 శాతం అధికంగా అధికారులు ఉన్నా సరే.. అక్కడి నుంచి ఎందుకు కేంద్ర సర్వీసుల్లోకి వారిని తీసుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌కు డీజీ స్థాయి అధికారుల సంఖ్య పరిమితి ఏడు కాగా.. అక్కడ ఏకంగా 15 మంది డీజీ ర్యాంకు అధికారులు ఉన్నారని... అదనపు డీజీ స్థాయి అధికారుల పరిమితి 21 కాగా.. ఏకంగా 63 మంది ఉన్నారని టీఎస్ ప్రభుత్వ వర్గాలు గణాంకాలను వెల్లడిస్తున్నాయి. కొత్తకొత్త పోస్టులు సృష్టించి సదరు అధికారులను యూపీలోనే ఉంచుకుంటున్నారని వివరిస్తున్నారు. మొత్తం అధికారుల్లో యూపీ నుంచి 167 మంది అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లాల్సి ఉండగా.. యూపీ మాత్రం కేవలం 28 మందిని మాత్రమే పంపి మిగిలిన వారిని తన దగ్గర ఉంచుకుందని వివరిస్తున్నారు.

విపక్ష పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాల్లో అధికారుల కొరత ఉన్నప్పటికీ .. డిప్యూటేషన్ల మీద పంపాలని ఒత్తిడి తెస్తున్న కేంద్రం.. మరి భారీగా అదనపు సంఖ్యలో అధికారులున్న యూపీని ఎందుకు పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు నిలదీస్తున్నాయి. కేవలం తమకు గిట్టని పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాల్లో పరిపాలనకు ఇబ్బందులు సృష్టించాలన్న ఉద్దేశంతోనే సీనియర్ అధికారులను కేంద్రానికి పంపాలంటూ ఒత్తిడి తెస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

First Published:  16 Nov 2022 3:49 AM GMT
Next Story