Telugu Global
Telangana

సొంత చాట్ జీపీటీ వెర్షన్‌ను సిద్ధం చేయబోతున్న తెలంగాణ ప్రభుత్వం!

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)తో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేయనున్నది. ప్రజలకు అవసరమైన సమాచారం, సేవలు అందించేందుకు వీలుగా ఈ ప్లాట్‌ఫామ్ పని చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.

సొంత చాట్ జీపీటీ వెర్షన్‌ను సిద్ధం చేయబోతున్న తెలంగాణ ప్రభుత్వం!
X

ఇప్పుడు ప్రపంచమంతా చాట్ జీపీటీ గురించే మాట్లాడుకుంటుంది. సమాచార, సేవల రంగంలో చాట్ జీపీటీ రాక ఒక విప్లవాత్మకమైన మార్పు అని నిపుణులు చెబుతున్నారు. ఓపెన్ఏఐ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన చాట్ జీపీటీని అనేక కంపెనీలు అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఓపెన్ఏఐ బేస్ట్‌గా తమదైన చాట్ జీపీటీని రూపొందించాలని కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభమైనట్లు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)తో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేయనున్నది. ప్రజలకు అవసరమైన సమాచారం, సేవలు అందించేందుకు వీలుగా ఈ ప్లాట్‌ఫామ్ పని చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఓపెన్ఏఐ ఆధారిత సర్వీసులు ప్రారంభించేందుకు ముందుగా.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌తో కలిసి అన్ని డిపార్ట్‌మెంట్లలోని ఉద్యోగులతో భారీ వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 8నే ఈ వర్క్ షాప్ జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ నెలాఖరుకు వాయిదా వేశారు.

తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో అనేక రకాలైన డేటా సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే మీ-సేవ ద్వారా పలు సర్వీసులు కూడా ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. కాగా, ఏదైనా శాఖకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్నా.. సేవలు పొందాలన్నా.. కాల్ సెంటర్లు మినహా మరో ఆప్షన్ లేదు. ఒక వేళ సంబంధిత కార్యాలయం దగ్గరకు వెళ్లినా.. ఉద్యోగుల దగ్గర పూర్తి స్థాయి సమాచారం అందుబాటులో ఉండటం లేదు. దీంతో అన్ని శాఖల డేటాను పూర్తిగా క్రోఢీకరించి చాట్ జీపీటీ ద్వారా తెలుసుకునే వెలుసుబాటను కల్పించనున్నారు.

ఇప్పటికే కొన్ని శాఖల్లో ఏఐ ఆధారిత సమాచార సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇటు వంటి వాటిని కూడా ఇంటిగ్రేట్ చేసి ఒకే ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. దీని వల్ల పౌర సేవలు మరింత సులభతరం అవుతాయని జయేశ్ రంజన్ అన్నారు. కాగా, ఇది ఏ ఉద్యోగులకు కూడా రిప్లేస్‌మెంట్ కాదని.. దీని వల్ల జాబ్స్‌లో కోత పడుతుందనే ఆందోళన వద్దని కూడా స్పష్టం చేశారు. మొదటి దశలో కేవలం సమాచారం కోసం ఈ ప్లాట్‌ఫామ్ సిద్ధం చేస్తారు. తర్వాతి దశల్లో సేవలను కూడా విస్తరించనున్నారు.

ఏ సంస్థకు, ప్రభుత్వానికి అయినా తమ సొంత చాట్ జీపీటీ వెర్షన్ తయారు చేయడం ప్రస్తుతం కష్టమైన పనే. అయితే ఓపెన్ సోర్స్ టూల్స్ ఉపయోగించి, గవర్నమెంట్ డేటాను వాడుకోవడం వల్ల తమదైన వెర్షన్ తయారు చేసుకోవచ్చు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా.. తర్వాత పూర్తి స్థాయి సేవలు అందించే స్థాయికి చేరుకోవచ్చని ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి తెలిపారు. త్వరలో నిర్వహించనున్న వర్క్‌షాప్‌లో అన్ని శాఖల ఉద్యోగులకు ఏఐ ఆధారిత చాట్ బోట్స్‌పై అవగాహన కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.

First Published:  10 Jun 2023 4:15 AM GMT
Next Story