Telugu Global
Telangana

కుల సంఘాలకు భూములు.. సంబరపడుతున్న బీసీలు..

తెలంగాణలో బీసీలకు కులాల వారీగా ప్రభుత్వం కోట్ల రూపాయల విలువైన భూములిస్తోంది. ఆయా భూముల్లో ఫంక్షన్ హాళ్లు, హాస్టళ్లు, ఉపాధి, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవ‌డానికి ఆర్థిక సాయం కూడా అందిస్తోంది.

కుల సంఘాలకు భూములు.. సంబరపడుతున్న బీసీలు..
X

హైదరాబాద్ లో కుల సంఘాలకు ప్రత్యేక భవనం అంటే.. ఖర్చుతో కూడుకున్న పనే. ఉన్నత వర్గాలకు ఇప్పటికే చాలా చోట్ల భవనాలున్నాయి, ఆయా భవనాల నిర్వహణను వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. కానీ బీసీ వర్గాలకు అలాంటి అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోంది. ఏక సంఘంగా ఏర్పడ్డ కులాలకు పట్టాలు మంజూరు చేస్తోంది. మొత్తం 41 కులాల‌కు కోకాపేట, ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ ప్రాంతాల్లో 87.3 ఎక‌రాలు కేటాయించారు. అంతే కాదు భవన నిర్మాణం కోసం 95.25 కోట్ల రూపాయలు ఇస్తున్నారు.

గతంలో 24 కుల సంఘాలకు పట్టాలు అందించారు. తాజాగా హైదరాబాద్ లో మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా మరో 11 బీసీ కుల సంఘాలకు పట్టాలు అందించారు. మొత్తం పట్టాలు పొందిన 35 కుల సంఘాలు వచ్చే ఏడాదికల్లా నూతన భవననాలు నిర్మించుకుని గృహప్రవేశాలు చేయాలని సూచించారు మంత్రులు.

బీసీల ఆత్మగౌరవం..

బీసీల ఆత్మగౌరవం పెంచే విధంగా ప్రభుత్వం తమకు విలువైన భూములు కేటాయిస్తోందని, కేసీఆర్ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందని అంటున్నారు కుల సంఘాల నేతలు. గతంలో కమ్యూనిటీ భవనాలకు చందాలు పోగు చేసుకునేవారమని, కానీ హైదరాబాద్ లో తమకు భూములివ్వడం, భవన నిర్మాణాలకు సాయం చేయడం మరచిపోలేమని చెబుతున్నారు. ప్ర‌తి ఆత్మ‌గౌర‌వ‌ భ‌వ‌నంలోనూ ఆయా కులాల్లోని ప్ర‌తి వ్య‌క్తికి భాగ‌స్వామ్యం కల్పిస్తామంటున్నారు. 75ఏళ్ల స్వాతంత్ర చ‌రిత్ర‌లో బీసీల‌ను గుర్తించింది కేవ‌లం కేసీఆరేనని అంటున్నారు కుల సంఘాల నాయకులు. 310 గురుకులాలు, ఓవ‌ర్సీస్ స్కాల‌ర్ షిప్‌లు, క‌ల్యాణ‌ల‌క్ష్మి స‌హా ప్ర‌తీ ప‌థ‌కంలో బీసీల‌దే మేజ‌ర్ వాటాగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో సంప‌ద పెంచుతూ దాన్ని పేద‌ల‌కు పంచుతున్నారని ప్రశంసించారు. ఎన్నిక‌ల‌ప్పుడే రాజ‌కీయం, మిగ‌తా స‌మ‌యంలో అభివృద్ధిపై కేసీఆర్ దృష్టిపెట్టారని అన్నారు.

First Published:  9 Sep 2022 3:58 AM GMT
Next Story