Telugu Global
Telangana

రైతు రుణమాఫీ కోసం రూ.167.59 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో రూ.41 వేల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయనున్నారు.

రైతు రుణమాఫీ కోసం రూ.167.59 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
X

తెలంగాణలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని గురువారం (ఆగస్టు 3) నుంచి తిరిగి ప్రారంభించారు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని.. వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రుణ మాఫీని పునప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. విడతల వారీగా రైతు రుణ మాఫీ జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం రూ.167.59 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది.

తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో రూ.41 వేల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయనున్నారు. రూ.37 వేల నుంచి రూ.41 వేల మధ్య ఉన్న రుణాలను ఈ నిధుల ద్వారా మాఫీ చేస్తారు. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 44,870 మంది రైతులకు లబ్ది చేకూరనున్నది. మిగిలిన రుణాల మాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం విడతల వారీగా నిధులను విడుదల చేయనున్నది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 1 లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేసింది. ఆనాడు 2014 మార్చి 31 వరకు ఉన్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేయడంతో 35,31,913 మంది రైతులు లబ్ది పొందారు. ఆనాడు రైతు రుణ మాఫీ కోసం రూ.16,144.10 కోట్ల మేర కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసింది.

2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు రూ.1 లక్ష లోపు అప్పు తీసుకున్న 42.56 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం రూ.28,930 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేసింది. అయితే ఇందులో తొలి విడతగా రూ.25 వేల లోపు ఉన్న వారి రుణాలను రద్దు చేసింది. ఆ తర్వాత రూ.36 వేల లోపు ఉన్న బాకీలు కూడా తీర్చేసింది. తాజాగా మిగిలిన వారి కోసం రూ.19వేల కోట్ల వ్యయం కానుండగా.. అందులో తొలి విడతగా రూ.37 వేల నుంచి రూ.41 వేల రుణం ఉన్న రుణాలకు సంబంధించి నిధులను విడుదల చేశారు.

First Published:  3 Aug 2023 12:11 PM GMT
Next Story