Telugu Global
Telangana

ఎంపీహెచ్‌ఏ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీహెచ్ఏ-ఎఫ్‌ల గరిష్ట అర్హత వయసు 44 ఏళ్ల నుంచి 49 ఏళ్లకు పెంచారు.

ఎంపీహెచ్‌ఏ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
X

మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ (ఎంపీహెచ్ఏ-మహిళలు) ఉద్యోగాల ఆశావహులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీహెచ్ఏ-ఎఫ్‌ల భర్తీకి ఇప్పటికే తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎంహెచ్ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా, ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసును, ఖాళీలను పెంచుతున్నట్లు తెలిపింది.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీహెచ్ఏ-ఎఫ్‌ల గరిష్ట అర్హత వయసు 44 ఏళ్ల నుంచి 49 ఏళ్లకు పెంచారు. అంతే కాకుండా గతంలో 1,520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. వీటికి అదనంగా 146 పోస్టులను చేర్చారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,666కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎంపీహెచ్ఏ-ఎఫ్ పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వెయిటేజీని కూడా 20 పాయింట్ల నుంచి 30 పాయింట్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాత పరీక్షకు 70 మార్కులు కేటాయించగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యులైన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అభ్యర్థులకు 30 పాయింట్ల వరకు వెయిటేజీ ఇవ్వనున్నారు.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతీ 6 నెలల సర్వీసుకు 2 పాయింట్లు కేటాయిస్తారు. ట్రైబల్ ఏరియాల్లో పని చేసిన వారికి 2.5 పాయింట్ల వెయిటేజీ ఇస్తారు. కేవలం పూర్తయిన 6 నెలలకు మాత్రమే వెయిటేజీ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. ఎంపీహెచ్ఏలను భారీగా నియమించడం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరింత మెరుగైన సేవలు అందించే వీలుంటుందని హరీశ్ రావు తెలిపారు. ఇది ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు వేసినట్లే అని వివరించారు.


First Published:  19 Aug 2023 2:52 PM GMT
Next Story