Telugu Global
Telangana

తెలంగాణలో జెండా పండగ.. నేతన్నలకు ఉపాధి మెండుగ..

23 కోట్ల రూపాయల వ్యయంతో 60 లక్షల స్వచ్ఛమైన పాలిస్టర్ వస్త్రంతో వీటిని తయారు చేస్తున్నారు. వస్త్రం తయారీ, రంగుల అద్దకం, జెండాలు కుట్టడం వంటి పనులన్నీ నేత కార్మికులే చేస్తున్నారు.

తెలంగాణలో జెండా పండగ.. నేతన్నలకు ఉపాధి మెండుగ..
X

స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై ఒక జెండా చొప్పున రాష్ట్రంలో కోటి జెండాలు ఎగురవేయాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన. దీనికి సంబంధించి వజ్రోత్సవ కమిటీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రెండు వారాలపాటు ఈ ఉత్సవాలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆగస్ట్-13నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై ఎగిరే జెండా కోసం నేతన్నలకు ఉపాధి మార్గం కూడా చూపెట్టింది ప్రభుత్వం. 50లక్షల జెండాల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.

సిరిసిల్ల నేతన్నల పనితనం..

సిరిసిల్ల చేనేత కార్మికులకు 50లక్షల జెండాలు తయారీ ఆర్డర్ వచ్చింది. దీంతో అక్కడ ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఉపాధీ దొరికినట్టయింది. సహజంగా ఇలాంటి బల్క్ ఆర్డర్ల విషయంలో త్వరగా పని పూర్తి కావాలంటే అందుబాటులో ఉన్న ఇతర ప్రాంతాలనుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికులను దృష్టిలో ఉంచుకుని కాస్త ముందుగానే పని మొదలు పెట్టింది. నేతన్నలు తయారు చేసిన జెండాలే ప్రతి ఇంటిపై ఎగిరేలా చర్యలు తీసుకుంటోంది. 23 కోట్ల రూపాయల వ్యయంతో 60 లక్షల స్వచ్ఛమైన పాలిస్టర్ వస్త్రంతో వీటిని తయారు చేస్తున్నారు. వస్త్రం తయారీ, రంగుల అద్దకం, జెండాలు కుట్టడం వంటి పనులన్నీ నేత కార్మికులే చేస్తున్నారు. మిగిలిన 50 లక్షల జెండాలను హైదరాబాద్‌ లో కుట్టిస్తున్నారు.

ఈనెల 5వతేదీనుంచి పదో తేదీలోగా జెండాలు జిల్లాలకు రవాణా అవుతాయి. 13నుంచి 15వేదీ వరకు వీటిని ప్రతి ఇంటిపై ఎగురవేస్తారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక జెండాను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. జెండాలను దిగుమతి చేసుకోవడం కంటే.. ఇక్కడే తయారు చేసుకోవడం వల్ల నేత కార్మికులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు అధికారులు.

First Published:  1 Aug 2022 1:40 AM GMT
Next Story