Telugu Global
Telangana

ముందుగా వాళ్లకే ఇందిరమ్మ ఇళ్లు

2 ఫేజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరగనుంది. ఫస్ట్‌ ఫేజ్‌లో సొంత స్థలం ఉన్నవాళ్లకు 5లక్షల రూపాయల నిధులు మంజూరు చేయబోతున్నారు. వారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోబోతున్నారు.

ముందుగా వాళ్లకే ఇందిరమ్మ ఇళ్లు
X

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. గత సర్కారు ఎన్నికల ముందు స్వీకరించిన గృహలక్ష్మి దరఖాస్తులను తిరస్కరించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రజాపాలన కార్యక్రమంలోనే ఇందిరమ్మ ఇళ్లకోసం పేదల నుంచి దరఖాస్తులు తీసుకోబోతున్నారు. అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక చేయబోతున్నారు.

2 ఫేజుల్లో ఇళ్ల నిర్మాణం..

2 ఫేజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరగనుంది. ఫస్ట్‌ ఫేజ్‌లో సొంత స్థలం ఉన్నవాళ్లకు 5లక్షల రూపాయల నిధులు మంజూరు చేయబోతున్నారు. వారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోబోతున్నారు. సెకండ్ ఫేజ్‌లో సొంత స్థలం లేని వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం నిధులు ఇవ్వబోతున్నారు. స్థలం లేని పేదలకు పంచడానికి భారీగా భూమి సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కోసం సమయం పడుతుంది. అందుకే ముందుగా స్థలం ఉన్నవాళ్లకు ఇంటినిర్మాణం కోసం 5లక్షల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇళ్ల డిజైన్లపై కసరత్తు..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 3 డిజైన్లు సిద్ధం చేసింది ప్రభుత్వం. అయితే ఆ డిజైన్లలో ఇళ్లను నిర్మించాలంటే.. కాలనీల తరహాలో ఒకేచోట భూమిని సేకరించాల్సి ఉంటుంది. సొంత జాగా ఉన్నవాళ్లు నిర్మించుకునే ఇళ్లు నిర్ధారిత డిజైన్‌లో ఉండాలంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కొందరిది ఉమ్మడి కుటుంబం ఉంటుంది. అందులో పెళ్లిళ్లు అయినవారు కొత్తగా ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటారు. వాళ్లు ఉంటున్న ఇంటికి ఆనుకుని ఉండే ఖాళీస్థలాల్లో ఇళ్లను నిర్మించుకుంటారు. అప్పుడు ఆ ఖాళీ స్థలం ఆకృతి అధికారులు రెడీ చేసిన డిజైన్‌కు అనుకూలంగా ఉండకపోవచ్చనే సందేహాలు ఉన్నాయి. ఈ అంశంపై త్వరలోనే ప్రభుత్వం ఓ క్లారిటీ ఇవ్వనుంది.

గతంలో 19 లక్షల ఇళ్లు..

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేశాయి. 2004– 2014 మధ్య తెలంగాణ ప్రాతంలో దాదాపు 19 లక్షల ఇళ్లు కట్టించారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావటంతో మళ్లీ ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.

First Published:  26 Dec 2023 5:42 AM GMT
Next Story