Telugu Global
Telangana

గవర్నర్ అవకతవకల ట్వీట్లు.. ఆటాడేసుకున్న నెటిజన్లు

మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో గవర్నర్ తమిళిసై ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆమె చేసిన ట్వీట్లను ఆమెకే కౌంటర్లు గా పెడుతున్నారు.

గవర్నర్ అవకతవకల ట్వీట్లు.. ఆటాడేసుకున్న నెటిజన్లు
X

గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక ఖాతానుంచి ట్వీట్ చేస్తే దానికో అర్థం ఉండాలి కానీ అది వ్యర్థమైన ట్వీట్ కాకూడదు. కానీ తెలంగాణ గవర్నర్ ఇటీవల వేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. రెండురోజుల క్రితం రాజ్ భవన్ కు, ఢిల్లీకి మధ్య ఎంత దూరం అంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీపై వేసిన ట్వీట్ గవర్నర్ కి రివర్స్ లో తగిలింది. అసలు సీఎస్ తనను కలవలేదంటూ గవర్నర్ ట్వీట్ వేశారు. ఆమె గవర్నర్ తో ఉన్న ఫొటోలను మెసేజ్ చేస్తూ నెటిజన్లు కౌంటర్లిచ్చారు. తాజాగా తెలంగాణ మెడికల్ కాలేజీలపై గవర్నర్ వేసిన ట్వీట్లు ట్రోల్ అవుతున్నాయి. వాటిని కవర్ చేసుకోలేక రాజ్ భవన్ వర్గాలు తెగ ఇదైపోతున్నాయి.

కేరళ మెడికల్ కాలేజీతో కథ మొదలు..

కేరళలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వేసిన ట్వీట్ ఈ కథ మొత్తానికి ఆరంభం. ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ తెలంగాణ గవర్నర్ తమిళిసై కేంద్ర ప్రభుత్వాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రధాన మంత్రి స్వస్త్య సురక్ష యోజన (PMSSY) అనేది ఓఅద్భుతమైన పథకం అని, ప్రధాని ముందు చూపుకి అది నిదర్శనం అంటూ తనదైన శైలిలో పొగడ్తల వర్షం కురిపించారు. ఈ ట్వీట్ కి ముఠా గణేష్ అనే వ్యక్తి కౌంటర్ ఇచ్చారు. అసలు తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన గవర్నర్ తమిళిసై, తెలంగాణ ప్రభుత్వంపై వెటకారమాడారు.


దేశంలోని అన్ని రాష్ట్రాలు PMSSY స్కీమ్ కింద కొత్త మెడికల్ కాలేజీలకోసం అప్లై చేసుకుంటే, తెలంగాణ ప్రభుత్వం ఆలస్యం చేసిందని. ఇప్పటి దాకా నిద్రపోయి ఇప్పుడే లేచి ప్రశ్నలు అడిగితే ఎలా అంటూ గవర్నర్ కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో తెలంగాణలో 11 కొత్త మెడికల్ కాలేజీలు ఒకే ఏడాది ఏర్పాటయ్యాయని కూడా బదులిచ్చారు.


పరస్పర విరుద్ధం..

తెలంగాణ ప్రభుత్వం అడగటం ఆలస్యమైంది అనేది నిజమైతే.. ఏడాదిలో 11 మెడికల్ కాలేజీల ఏర్పాటు అనేది అబద్ధం అయిఉండాలి. పోనీ 11 మెడికల్ కాలేజీలు నిజమైతే.. తమిళిసై ట్వీట్ అసత్యం అయి ఉండాలి. ఇక్కడే ఆమె పూర్తిగా ఇరుక్కుపోయారు. విచిత్రం ఏంటంటే కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ అకౌంట్ ని కూడా ఆమె సరిగా మెన్షన్ చేయలేదు. ఆ ట్వీట్ అంతా తప్పుల తడకే.

ఈ లెటర్ సంగతేంటి..?

ఈ వ్యవహారం ఇక్కడితో ఆగిపోలేదు.. గతంలో PMSSY స్కీమ్ కింద మెడికల్ కాలేజీల ఏర్పాటుకోసం కేంద్రం దరఖాస్తులు స్వీకరించింది. అప్పటి తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి లేఖ రాశారు. అప్పటి కేంద్ర హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్ష వర్దన్ దానికి బదులిచ్చారు. PMSSY స్కీమ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లో తెలంగాణ లేదని, మూడో ఫేజ్ కింద మెడికల్ కాలేజీల ఏర్పాటు చూస్తామని హామీ ఇచ్చారు. ఈ లెటర్ ని భరత్ అనే మరో నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగా అప్లై చేసిందంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు అసత్యాలని అన్నారు. ఈ లెటరే దానికి నిదర్శనం అని చెప్పారు. గవర్నర్ వాట్సప్ యూనివర్శిటీనుంచి సమాచారం సేకరించి ఉంటారని కౌంటర్ ఇచ్చారు.


ఇదీ మీరేనా..? మీరు కాదా..?

గతంలో మెడికల్ కాలేజీల విషయంలో గవర్నర్ తమిళిసై ప్రసంగాలని కూడా జోడిస్తూ నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. అప్పట్లో స్వయంగా గవర్నర్ మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు మీవేనా, అసలప్పుడు మాట్లాడింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మీరు తెలంగాణ గవర్నర్ గా ఉన్నారా, లేక బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారా అంటూ మరికొందరు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెబుతారంటూ నిలదీశారు.


మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో గవర్నర్ తమిళిసై ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆమె చేసిన ట్వీట్లను ఆమెకే కౌంటర్లు గా పెడుతున్నారు.

First Published:  5 March 2023 5:05 AM GMT
Next Story