Telugu Global
Telangana

నేటినుంచి ఢిల్లీలో మ్యూజియం ఎక్స్ పో.. ప్రదర్శనకు తెలంగాణ గంగపటం

ఖమ్మం జిల్లాకు చెందిన 85 ఏళ్లనాటి గంగపటాన్ని ఈ మ్యూజియం ఎక్స్ పో లో ప్రదర్శిస్తారు. బొమ్మలక్రమం ఆధారంగా అప్పట్లో గంగపటం చూపిస్తూ కళాకారులు కథాగానం చేసేవారు.

నేటినుంచి ఢిల్లీలో మ్యూజియం ఎక్స్ పో.. ప్రదర్శనకు తెలంగాణ గంగపటం
X

'అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్ పో' ఈరోజు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ప్రారంభమవుతుంది. మూడు రోజులపాటు ఈ ఎక్స్ పో జరుగుతుంది. ప్రతి ఏడాదీ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా మే-18 ఢిల్లీలో మ్యూజియం ఎక్స్ పో ప్రారంభిస్తారు. ఈ ఏడాది తెలంగాణ నుంచి గంగపటం ఈ ఎక్స్ పో లో ప్రదర్శనకు ఎంపికైంది.

ఖమ్మం జిల్లాకు చెందిన 85 ఏళ్లనాటి గంగపటాన్ని ఈ మ్యూజియం ఎక్స్ పో లో ప్రదర్శిస్తారు.భారీ వస్త్రంపై బండారు కలంకారీ పనివారు గంగపటాన్ని చిత్రీకరించారు. 12వ శతాబ్దానికి చెందిన యాదవ వీరుడు కాటమరాజు కథను ఇందులో పొందుపరిచారు. యాదవ చరిత్ర, కాటమరాజు చరిత్ర, పౌరాణిక ఘట్టాలు చిత్రాల రూపంలో ఈ పటంలో కనపడతాయి. గంగమ్మ ప్రధాన పాత్రగా ఈ కథ, కథనం ఉంటుంది. బొమ్మలక్రమం ఆధారంగా అప్పట్లో గంగపటం చూపిస్తూ కళాకారులు కథాగానం చేసేవారు. తిత్తివాద్యం వాయిస్తూ కాటమరాజు చరిత్రను ఊరూరా చెప్పేవారు.

భారత దేశంలో మ్యూజియంల పాత్రను ప్రముఖంగా తెలిపేందుకు ఈ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. మరుగున పడుతున్న సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పురాతన కళలకు సంబంధించిన ఆధారాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. మస్కట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్‌ పో ని కూడా ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు.

First Published:  18 May 2023 1:56 AM GMT
Next Story