Telugu Global
Telangana

దశాబ్ది సంబరం.. నేడు రైతు దినోత్సవం

మలిరోజు కార్యక్రమం రైతులది. ఈరోజు తెలంగాణ రైతు దినోత్సవం జరుపుకుంటున్నారు.

దశాబ్ది సంబరం.. నేడు రైతు దినోత్సవం
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. తొలిరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సచివాలయంలో జాతీయ జెండా ఎగురవేసి సీఎం కేసీఆర్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఊరూరా, వాడ వాడలా.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకులు అమరవీరులను స్మరించుకుంటూ, తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన విజయాలను గుర్తు చేస్తూ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇక మలిరోజు కార్యక్రమం రైతులది. ఈరోజు తెలంగాణ రైతు దినోత్సవం జరుపుకుంటున్నారు.

రైతు వేదికల వద్ద కార్యక్రమాలు..

తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతాంగానికి, వ్యవసాయానికి కేసీఆర్ సర్కారు ఎంతో ప్రోత్సాహమిచ్చింది. రైతు రుణమాఫీ, 24 గంటల విద్యుత్ సరఫరా, రైతు బంధు, రైతు బీమా వంటివి అమలు చేశారు. రైతు వేదికల నిర్మాణం, పంట కల్లాల నిర్మాణం, రైతు బంధు సమితుల ఏర్పాటు, నీటి తీరువాల రద్దుతో తెలంగాణలో వ్యవసాయం పండగలా మారింది. తెలంగాణలో రైతులకు అమలవుతున్న పథకాలకోసం ఇతర రాష్ట్రాల్లో రైతులు అక్కడి స్థానిక ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే దశాబ్ది ఉత్సవాల్లో రైతు దినోత్సవం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు వేదిక వద్ద పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం కోసం చేపట్టిన కార్యక్రమాలు, వాటి విజయాలను మరోసారి రైతులకు వివరిస్తారు. ఏయే ప్రాంతాల్లో ఎంత ఆయకట్టు పెరిగింది, దిగుబడులు ఎలా ఉన్నాయి అనే అంశాలను వివరిస్తారు. వ్యవసాయం విషయంలో తెలంగాణకు ఇతర రాష్ట్రాలకు ఉన్న తేడాలను కూడా విశదీకరిస్తారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొంటారు. రైతు విజయానికి ప్రతీకగా ఈ రైతు దినోత్సవం నిర్వహిస్తున్నామని చెబుతున్నారు.

First Published:  3 Jun 2023 2:35 AM GMT
Next Story