Telugu Global
Telangana

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 9,168 గ్రూప్-4 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి

గ్రూప్-4 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్లు మంత్రి హరీశ్ రావు ట్విట్టర్‌లో వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 9,168 గ్రూప్-4 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి
X

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇటీవలే మంత్రి హరీశ్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 9,168 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నింటినీ టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులు ఎన్నాళ్లుగానో గ్రూప్-4 పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 80 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి పలు నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తోంది.

తాజాగా ఆర్థిక శాఖ ఆమోదించిన పోస్టుల్లో మూడు కేటగిరీలకు చెందిన ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాల్లో అత్యధికంగా 6,857 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 1,862 వార్డు ఆఫీసర్ పోస్టులు ఉండగా.. పంచాయతీ రాజ్ శాఖలో 1,245 పోస్టులు, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429, జూనియర్ ఆడిటర్ పోస్టులు 18 ఉన్నాయి. ఇక రెవెన్యూ శాఖలో 2,077 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

గ్రూప్-4 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్లు మంత్రి హరీశ్ రావు ట్విట్టర్‌లో వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆశావహులకు మంత్రి శుభాకాంక్షలు చెప్పారు. ఆర్థిక శాఖ అనుమతి రావడంతో టీఎస్‌పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నది.


First Published:  25 Nov 2022 2:54 PM GMT
Next Story