Telugu Global
Telangana

రైతు సమస్యలే ఎజెండా..రేవంత్‌కు హరీష్‌ మరో లేఖ

సీఎం రేవంత్‌ రెడ్డికి మరో లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. పొద్దు తిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించి..పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతు సమస్యలే ఎజెండా..రేవంత్‌కు హరీష్‌ మరో లేఖ
X

సీఎం రేవంత్‌ రెడ్డికి మరో లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. పొద్దు తిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించి..పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 20 వేలకుపైగా ఎకరాల్లో రైతులు పొద్దుతిరుగుడు పంట సాగు చేశారని చెప్పారు.

పొద్దుతిరుగుడు పంటకు మార్కెట్‌లో కనీస మద్దతు ధర లభించడం లేదని ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు హరీష్‌ రావు. అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించి..పొద్దుతిరుగుడు పంటను కనీస మద్దతు ధర రూ. 6 వేల 760 చెల్లించి కొంటామని హామీ ఇచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు హరీష్‌. దాని ప్రకారమే కొనుగోళ్లు ప్రారంభం అయినప్పటికీ..రైతులు తెచ్చిన మొత్తం పంటను కోనుగోలు చేయకుండా..కేవలం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేశారన్నారు హరీష్‌.

మిగతా పంటను ప్రస్తుతం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు హరీష్‌ రావు. దీంతో 75 శాతం పంటను రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తుందన్నారు. కేవలం 4-5 వేలకే తమ పంటను అమ్ముకుని రైతులు నష్టపోతున్నారన్నారు హరీష్‌ రావు. స్వయంగా జోక్యం చేసుకుని పొద్దుతిరుగుడు పువ్వు పంటను మొత్తం MSP చెల్లించి కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్‌ను డిమాండ్ చేశారు హరీష్ రావు.



First Published:  8 April 2024 7:10 AM GMT
Next Story