Telugu Global
Telangana

బోనస్ కోసం పోరుబాట.. రైతు ఉద్యమం మొదలవుతోంది

ఈరోజు అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపడతారు. వరికి బోనస్ ప్రకటించాలంటూ కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తారు.

బోనస్ కోసం పోరుబాట.. రైతు ఉద్యమం మొదలవుతోంది
X

తెలంగాణలో రైతు ఉద్యమం మొదలవుతోంది. ముందుగా వరికి ప్రకటించిన బోనస్ కోసం అన్నదాతలు రోడ్డెక్కబోతున్నారు. అధికారంలోకి వచ్చే ముందు ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 100 రోజుల పాలనలో అన్ని హామీలు నెరవేర్చామంటున్న ప్రభుత్వం బోనస్ పై మాత్రం మాట దాటేస్తోంది. యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలైనా బోనస్‌పై ప్రకటన చేయలేదు. దీంతో రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉద్యమం మొదలు పెట్టారు.

నేడు కలెక్టరేట్ల ముందు నిరసన..

ఈరోజు అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపడతారు. బోనస్ పై కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ప్రభుత్వానికి వినతిపత్రం ఇస్తారు. ఈ వినతుల తర్వాత కూడా బోనస్‌పై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే.. ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.

వాయిదాలు..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడేనాటికి ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. వానాకాలం సీజన్ కి సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు బోనస్ ఇవ్వలేమంటూ యాసంగికి వాయిదా వేసింది ప్రభుత్వం. తీరా ఇప్పుడు యాసంగిలో కూడా బోనస్ హామీ బోగస్ అని తేలింది. ఏప్రిల్‌ ఒకటోతేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని పౌరసరఫరాల సంస్థ, ప్రభుత్వం ప్రకటించాయి కానీ, బోనస్‌పై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో వానకాలం మాదిరిగానే యాసంగి ధాన్యానికి కూడా ప్రభుత్వం బోనస్‌ ఇవ్వకుండా హ్యాండ్ ఇస్తుందనే విమర్శలు మొదలయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేసీఆర్ పర్యటనపై విమర్శలు గుప్పించేందుకు ప్రెస్ మీట్ పెట్టారే కానీ, బోనస్ పై ప్రకటన చేయలేదు. ఇతర నేతలు కూడా స్పందించలేదు. దీంతో రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బోనస్ ప్రకటించి ఉంటే రైతులకు రూ. 3750 కోట్లమేర అదనపు ఆదాయం సమకూరేది. కానీ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా స్పందించకపోవడం విశేషం.

First Published:  2 April 2024 2:03 AM GMT
Next Story