Telugu Global
Telangana

ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నియామకాలు ఉత్తుత్తివేనా..?

ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు తీసుకున్న 614 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లను ట్రైనింగ్ కి పంపించలేదని, 40రోజులుగా వారు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నియామకాలు ఉత్తుత్తివేనా..?
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నియామకాలు అందుకుంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లు. ఆ నియామకపత్రాలు జారీ అయి 40రోజులు గడుస్తున్నా ఇంకా వారిని ట్రైనింగ్ కి పిలవలేదు. కారణం ఏంటి..? వారికి ఇచ్చిన నియామక పత్రాలు ఉత్తుత్తివేనా..? వారిని ట్రైనింగ్ కి పిలవకుండా ఎందుకు త్రిశంకు స్వర్గంలో పెట్టారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా..? లేదా? అంటూ ఆయన ట్వీట్ వేశారు.


ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నియామక పత్రాలు అందించే సమయంలో కూడా బీఆర్ఎస్ నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. నోటిఫికేషన్ ఇచ్చింది, పరీక్ష నిర్వహించింది, నియామకాలు చేపట్టింది కేసీఆర్ అయితే, కొత్తగా సీఎం అయిన రేవంత్ రెడ్డి ఆ క్రెడిట్ కొట్టేయడానికి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. అయితే ఆ నియామక పత్రాల ఎపిసోడ్ కూడా అంతా బూటకం అంటూ తాజాగా విమర్శలు మొదలయ్యాయి.

ఎంతో ఆర్భాటంగా ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు తీసుకున్న 614 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లను ట్రైనింగ్ కి పంపించలేదని, 40రోజులుగా వారు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ విషయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తన చేతుల్లో ఏమీ లేదని చెప్పడం మరింత విడ్డూరం అని విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వం లేదని, అది కనిపిస్తే కాస్త జాడ చెప్పండి అంటూ సెటైర్లు పేల్చారు ప్రవీణ్ కుమార్.

First Published:  27 March 2024 8:04 AM GMT
Next Story