Telugu Global
Telangana

బడ్జెట్‌లో ఈహెచ్ఎస్ ప్రకటన.. ప్రభుత్వానికి ఉద్యోగల సంఘాల కృతజ్ఞతలు

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ ఆర్థిక సంవత్సరం నుంచే సరికొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని అమలులోకి తీసుకొని రావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బడ్జెట్‌లో ఈహెచ్ఎస్ ప్రకటన.. ప్రభుత్వానికి ఉద్యోగల సంఘాల కృతజ్ఞతలు
X

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్‌లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను ప్రకటించడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రకటించిన వెంటనే ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు. భారీగా ఖర్చు పెట్టకుండానే ఉద్యోగులకు ఆరోగ్య భరోసా కల్పించడంపై సానుకూల స్పందన వస్తోంది. అంతే కాకుండా పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్టులో భాగస్వామ్యులుగా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ ఆర్థిక సంవత్సరం నుంచే సరికొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని అమలులోకి తీసుకొని రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్టులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తామని ప్రకటించింది. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పింది. ఈహెచ్ఎస్ అమలులోకి వస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు కార్పొరేట్ స్థాయి వైద్యం అందనున్నది. ఈ పథకం ద్వారా మొత్తం 6.6 లక్షల మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్‌తో పాటు 16 లక్షల మంది కుటుంబ సభ్యులకు లబ్ది చేకూరనున్నది.

ఈసీహెచ్‌కు చందాగా ప్రతీ నెల ఉద్యోగల బేసిక్ నుంచి ఒక శాతం కట్ చేసే అవకాశం ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఒక శాతం జమ చేస్తుందన్నారు. ఈ మొత్తాన్ని కార్పస్ ఫండ్‌గా జమ చేస్తారు. ఈ కార్పస్ ఫండ్ నుంచే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులను చెల్లిస్తారు. ఉద్యోగుల వాటాతో పటిష్టమైన ఆరోగ్య పథకాన్ని ప్రకటించడం ఇదే మొదటిసారని.. ఇందుకు రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. గతంలో ఇలాంటి పథకాన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీ ద్వారా అందజేయగా.. ఇప్పుడు మాత్రం ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తారు.

ఈ పథకం ద్వారా క్యాన్సర్, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి ఖరీదైన చికిత్సలను కూడా చేర్చనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈహెచ్ఎస్ పథకం తెలంగాణలో అమలు అవుతున్నా.. వాటికి కొన్ని పరిమితులు ఉండటంతోనే కొత్తగా రూపొందించినట్లు తెలుస్తున్నది. తమిళనాడు తరహాలో ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయనున్నారు. కాగా, కొత్త ఈహెచ్ఎస్ పథకాన్ని ప్రకటించడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీఎన్జీవో నేతలు సోమవారం హైదరాబాద్‌లో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

First Published:  7 Feb 2023 2:48 AM GMT
Next Story