Telugu Global
Telangana

కాంగ్రెస్ లో మరో కమిటీ.. ఈ సారి పెద్దపీట ఎవరికంటే..?

ప్రచారంలో బీజేపీ కాస్త వెనకబడినట్టు అనిపించినా, కాంగ్రెస్ మాత్రం ఈ సారి తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఐదు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల ఎన్నికలు ఇప్పటికే పూర్తి కావడంతో తెలంగాణపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది.

కాంగ్రెస్ లో మరో కమిటీ.. ఈసారి పెద్దపీట ఎవరికంటే..?
X

ఎన్నికల వేళ కాంగ్రెస్ లో రకరకాల కమిటీలు ఏర్పాటవుతున్నాయి. ఈ కమిటీలతో ఉపయోగం ఏంటి అనే విషయాన్ని పక్కనపెడితే.. టికెట్లు రాని వాళ్లకు కమిటీలో పెద్దపీట వేసి ఎన్నికల వేళ వారి మాట చెల్లుబాటు అయ్యేలా చూస్తోంది అధిష్టానం. అదే సమయంలో పక్క పార్టీల నుంచి వచ్చినవారికి కూడా కమిటీల్లో పెద్దపీట వేసి వారికి భవిష్యత్ పై భరోసా కల్పిస్తోంది. ఇటీవలే విజయశాంతికి క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీ చీఫ్‌ కో-ఆర్డినేటర్‌ గా పదవి ఇచ్చింది. తాజాగా ఇప్పుడు మరో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కోఆర్డినేషన్ కమిటీకి చల్లా వంశీచంద్ రెడ్డిని కన్వీనర్ గా నియమించింది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ల ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు ఏఐసీసీ ఈ కమిటీని నియమించింది. కన్వీనర్‌గా చల్లా వంశీ చంద్ రెడ్డి, కో-కన్వీనర్ - మహేష్ కుమార్ గౌడ్, సభ్యులుగా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, నూతి శ్రీకాంత్, ప్రీతంలను నియమించారు. ఈమేరకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ పేరుతో ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నెల 22 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ అగ్ర నేతల పర్యటనలు, సభలు, సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ నియోజకవర్గాల్లో ఈ కమిటీ ఎన్నికల ప్రచారాల కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలిస్తుంది. ఈనెల 28 వరకు కమిటీ సభ్యులంతా వివిధ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు. ఏఐసీసీ అగ్ర నేతల పర్యటనలను కోఆర్డినేట్ చేస్తారు. స్థానిక కాంగ్రెస్ కేడర్‌ కు వీరు వివిధ బాధ్యతలు అప్పగిస్తారు.

ప్రచారంలో బీజేపీ కాస్త వెనకబడినట్టు అనిపించినా, కాంగ్రెస్ మాత్రం ఈసారి తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఐదు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల ఎన్నికలు ఇప్పటికే పూర్తి కావడంతో తెలంగాణపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఇప్పటికే రాహుల్, ప్రియాంక కూడా పర్యటించి వెళ్లారు. కర్నాటక లీడర్లను తెస్తున్నారు కానీ, ఆ స్ట్రాటజీ పెద్దగా వర్కవుట్ అయినట్టు లేదు. అందుకే ఇప్పుడు కేవలం ప్రియాంక, రాహుల్, ఖర్గే మాత్రమే తెలంగాణలో సభలకు హాజరవుతున్నారు.

First Published:  20 Nov 2023 7:44 AM GMT
Next Story