Telugu Global
Telangana

ప్రచారం ఈజీ.. పంచిపెట్టడమే కష్టం

సీవిజిల్‌ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ వెళ్లి తనిఖీలు చేపట్టింది. ఇంటి తాళం పగలగొట్టి మరీ లోపలికి వెళ్లి తనిఖీలు చేశారు పోలీసులు. తనిఖీల్లో రూ.2,18,90,000 నగదు దొరికింది.

ప్రచారం ఈజీ.. పంచిపెట్టడమే కష్టం
X

తెలంగాణ ఎన్నికల ఎపిసోడ్ చూస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రచారం చేసినంత ఈజీగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం కష్టసాధ్యం అని చెప్పాలి. దాదాపు అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్లారు. సభలు, రోడ్ షో లు, కార్నర్ మీటింగ్ లు అంటూ హడావిడి చేశారు. భారీగా జన సమీకరణ చేపట్టారు. ఈరోజుతో ఆ హడావిడి పూర్తయినట్టే లెక్క. ఇక గెలుపు కోసం అభ్యర్థులు నోట్ల పంపిణీకి సిద్ధమయ్యే టైమ్ వచ్చింది. అయితే ప్రచారం చేసినంత ఈజీగా పంపిణీ జరిగేలా లేదు. ఎక్కడికక్కడ తనిఖీలు కట్టుదిట్టం చేయడంతోపాటు, ఫ్లైయింగ్ స్క్వాడ్ లు చీమ చిటుక్కుమన్నా వచ్చి వాలేస్తున్నాయి. దీంతో డబ్బు పంపిణీ కష్టమైపోయిందని బాధపడుతున్నారు కొంతమంది.

ఖమ్మంలో నోట్ల కట్టలు

ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో రూ.14 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటన విడుదల చేశారు. రూ.9,63,34,880 నగదు, రూ.4,27,88,147 విలువైన మద్యం, రూ.5,96,250 విలువైన మత్తు మందులు, రూ.46,25,000 విలువైన చీరలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఎన్నికల ఎపిసోడ్ మొదలయ్యాక, ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం రూ.724 కోట్లకు చేరింది. ఖమ్మం జిల్లా పాలేరులో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన రూ.3 కోట్లను ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఐటీ అధికారులు, పోలీసులు సీజ్‌ చేశారు. కాంగ్రెస్ అభిమాని చండు కరుణ ఇంట్లో ఈ నగదు పట్టుబడటం విశేషం. పోలీసులకు సమాచారం అందడంతో వారు హుటాహుటిన కరుణ ఇంటికి వచ్చారు. అప్పటికే ఆ డబ్బు వేరే చోటికి తరలించేందుకు ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు పోలీసుల్ని చూసి పారిపోయారు. నగదుని సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరపున ఈ నగదు పంచబోతున్నట్టు గుర్తించారు.

పెద్దపల్లి జిల్లాలో రూ.2.19 కోట్లు..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎన్టీపీసీ కృష్ణానగర్‌ లో అధికారులు రూ.2,18,90,000 నగదును పట్టుకున్నారు. సీవిజిల్‌ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ వెళ్లి తనిఖీలు చేపట్టింది. ఇంటికి వేసి ఉన్న తాళం పగలగొట్టి మరీ లోపలికి వెళ్లి తనిఖీలు చేశారు పోలీసులు. తనిఖీల్లో రూ.2,18,90,000 నగదు దొరికింది. పోలీసులు ఆ నగదుని సీజ్ చేశారు.

First Published:  28 Nov 2023 10:30 AM GMT
Next Story