Telugu Global
Telangana

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెలువడేది అప్పుడేనా? కసరత్తు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం

ఈ ఏడాది అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. దీంతో అక్టోబర్ 5 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది.

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెలువడేది అప్పుడేనా? కసరత్తు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగాల్సి ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఈవీఎం, వీవీ పాట్ల చెకింగ్ ఇప్పటికే ప్రారంభించారు. వీటికి సంబంధించిన శిక్షణ కూడా జిల్లా రిటర్నింగ్ అధికారులకు గత నెలలోనే ఇచ్చారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 5 నుంచి 15 మధ్యలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు ఈసీఐ వర్గాలు తెలియజేశాయి.

2018లో ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 6న వచ్చింది. డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించారు. ఈ ఏడాది అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. దీంతో అక్టోబర్ 5 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. గత ఎన్నికల షెడ్యూల్ లాగానే ఈ సారి కూడా ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, భద్రతా చర్యలపై డీజీపీ అంజనీ కుమార్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు.

మరోవైపు ఈసీఐ బృందం తెలంగాణలో ఈ నెల 22 నుంచి 24 వరకు పర్యటించనున్నది. సీనియర్ డిప్యుటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పర్యటించే బృందం.. ఎన్నికల ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో పరిశీలించనున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండంతో ఈ కీలక పర్యటన చేపట్టినట్లు తెలుస్తున్నది. ఈ పర్యటన నేపథ్యంలో తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వియాస్ రాజ్ ఇటీవలే ఒక కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో డీజీపీ అంజనీ కుమార్ కూడా పాల్గొన్నారు.

రాష్ట్రంలో పర్యటించనున్న ఈసీఐ బృందం.. తెలంగాణ సీఈవో, స్పెషల్ పోలీస్ నోడల్ ఆఫీసర్, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ నోడల్ ఆఫీసర్‌తో సమావేశం కానున్నారు. ఎన్నికల సమయంలో భద్రత విషయంలో ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేయాలనే విషయంపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత ఈసీఐ బృందం.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ప్రభుత్వ అధికారులతో భేటీ కానున్నది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్, రాష్ట్ర జీఎస్టీ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, స్టేట్ లెవెలె బ్యాంకర్స్ కమిటీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఉన్నత అధికారులతో భేటీ కానున్నది. ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహాన్ని అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈసీఐ సూచించనున్నది. అందుకు అనుసరించవలసిన వ్యూహాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

First Published:  20 Jun 2023 10:24 AM GMT
Next Story