Telugu Global
Telangana

450కోట్లు, 256 ఎఫ్ఐఆర్ లు.. తెలంగాణలో ఆల్ టైమ్ రికార్డ్

శుక్రవారం వరకు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు 256 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని వికాస్ రాజ్ తెలిపారు. బీఆర్‌ఎస్‌ పై 30, కాంగ్రెస్‌ పై 16, బీజేపీపై 5, బీఎస్పీపై 5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు.

450కోట్లు, 256 ఎఫ్ఐఆర్ లు.. తెలంగాణలో ఆల్ టైమ్ రికార్డ్
X

తెలంగాణలో నామినేషన్ల పర్వం మొదలైంది. అదే సమయంలో ప్రలోభాల పర్వం కూడా జోరుగా సాగే అవకాశముంది. వివిధ ఏజెన్సీలు రంగంలోకి దిగి తనిఖీలు చేపడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు.. ఎవరి వాహనాలను కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. నింబధనలకు విరుద్ధంగా తరలిస్తున్న సొమ్ముని ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నా.. తనిఖీలు మాత్రం పక్కాగా జరుగుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాలు ఇప్పటివరకు దాదాపు రూ.450 కోట్ల నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. సామాన్యులెవరూ ఇబ్బంది పడకుండా చూస్తున్నామని అన్నారు. అదనపు కేంద్ర బలగాలు పలు జిల్లాలకు చేరుకుని ఓటర్లలో విశ్వాసం నింపేందుకు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించాయన్నారు.

శుక్రవారం వరకు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు 256 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని వికాస్ రాజ్ తెలిపారు. బీఆర్‌ఎస్‌ పై 30, కాంగ్రెస్‌ పై 16, బీజేపీపై 5, బీఎస్పీపై 5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు. దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి ఘటనపై పోలీసుల నుంచి నివేదిక కోరామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి ఎన్నికల సందర్భంగా పట్టుబడిన సొమ్ము చాలా ఎక్కువ. ఇంకా ఎన్నికలకు 26రోజుల సమయం ఉంది. ఈలోపు మరింత సొత్తు పట్టుబడే అవకాశముందని అంటున్నారు. మొత్తమ్మీద ఎన్నికల తనిఖీల్లో పట్టుబడి సొమ్ము సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది.

First Published:  4 Nov 2023 1:49 PM GMT
Next Story