Telugu Global
Telangana

దశాబ్ది సంబరం.. నేడు మంచినీళ్ల పండగ

జిల్లా, నియోజవర్గ కేంద్రాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పాత్రికేయులు, ప్రజలు.. మిషన్‌ భగీరథ ఫిల్టర్‌ బెడ్స్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు సందర్శించేలా కార్యక్రమాలు రూపొందించారు.

దశాబ్ది సంబరం.. నేడు మంచినీళ్ల పండగ
X

తెలంగాణలో సాగునీరు, తాగునీరు.. గురించి చెప్పుకోవాలంటే రాష్ట్రం ఏర్పడక ముందు, ఆ తర్వాత అన్నంతగా మారిపోయాయి పరిస్థితులు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ.. ద్వారా సాగు, తాగునీటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ముఖ్యంగా తాగునీటి రంగంలో పట్టణాలు, పల్లెలు అనే తేడాలేకుండా ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు సరఫరా అవుతోంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ప్రజలకు ఎలాంటి మంచినీటిని సరఫరా చేస్తున్నామో ఆదిలాబాద్ గిరిజన తండాలకు కూడా అవే నీటిని పంపిణీ చేస్తున్నామంటూ పాలకులు గర్వంగా చెప్పుకునే పరిస్థితి. దీనికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్. ఉమ్మడి పాలనలో ఎదుర్కొన్న కష్టాలను తీర్చే దిశగా ఆయన వేసిన తొలి అడుగు నేడు సత్ఫలితాలనిచ్చింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మంచినీళ్ల పండగ జరుపుకునేలా చేసింది.

మంచి నీళ్ల పండగ అంటే..?

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించేదే మంచినీళ్ల పండగ. అప్పుడెలా ఉన్నాం, ఇప్పుడెలా ఉంటున్నాం అనే తేడాను వివరిస్తూ ప్రజల్లో నీటి వాడకంపై అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంచినీళ్ల పండగను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో మిషన్‌ భగీరథ విజయోత్సవ సభ నిర్వహిస్తారు. ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు హాజరవుతారు.

జిల్లా, నియోజవర్గ కేంద్రాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పాత్రికేయులు, ప్రజలు.. మిషన్‌ భగీరథ ఫిల్టర్‌ బెడ్స్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు సందర్శించేలా కార్యక్రమాలు రూపొందించారు. తాగునీటి కష్టాలు సంపూర్ణంగా తీరిపోయి, మహిళలు సంతోషిస్తున్న విధానాన్ని తెలియజేస్తూ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

First Published:  18 Jun 2023 3:04 AM GMT
Next Story