Telugu Global
Telangana

తెలంగాణ: గతేడాదితో పోల్చితే 57 శాతం పెరిగిన సైబర్ నేరాలు

రాష్ట్రంలో మహిళలపై నేరాలు 3.8 శాతం పెరిగినా... ఈ కేటగిరీలో అత్యాచార కేసులు, పోక్సో చట్టం కేసులు తగ్గాయి. అదే సమయంలో గృహ హింస, వరకట్న వేధింపుల కేసులు పెరిగాయని డీజీపీ చెప్పారు.

తెలంగాణ: గతేడాదితో పోల్చితే 57 శాతం పెరిగిన సైబర్ నేరాలు
X

రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 4.44 శాతం నేరాలు పెరిగాయని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. 2022 వార్షిక నేర నివేదికను డీజీపీ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలు 57 శాతం పెరిగాయన్నారు. ఈ ఏడాది 120 మంది మావోయిస్టులు లొంగిపోయారని, రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మావోయిస్టు నిరోధక చర్యలు విజయవంతంగా నిర్వహించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహా సేవలు అందించాలనే లక్ష్యంలో భాగంగా తెలంగాణ పోలీసు శాఖ ముందుకు సాగిందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మత ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాగా పనిచేసింద‌న్నారు. గతేడాది కన్విక్షన్ రేటు (నేర నిరూపణ రేటు) 50 శాతం ఉంటే, ఈ ఏడాది మరో 6 శాతం పెరిగి 56 శాతంగా నమోదైందని వెల్లడించారు.152 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా 18,234 కేసులను పరిష్కరించామని, 431 మందిని పీడీ చట్టం కింద జైలుకు పంపామని, రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్‌లో 6,157 ఫిర్యాదులు అందాయని, వాటిలో 2,128 కేసులు నమోదయ్యాయని డీజీపీ తెలిపారు.

రాష్ట్రంలో మహిళలపై నేరాలు 3.8 శాతం పెరిగినా... ఈ కేటగిరీలో అత్యాచార కేసులు, పోక్సో చట్టం కేసులు తగ్గాయి. అదే సమయంలో గృహ హింస, వరకట్న వేధింపుల కేసులు పెరిగాయని డీజీపీ చెప్పారు.

డ్రగ్స్ వ్యవహారాల్లో ఉక్కుపాదం మోపుతున్నామని, 1,176 కేసులు నమోదు కాగా, 2,582 మందిని అరెస్ట్ చేసిన‌ట్టు ఆయన తెలిపారు

ఈ ఏడాది 24,127 దోపిడీ కేసులు, 2,432 పోక్సో కేసులు, 2,126 అత్యాచార కేసులు, 762 హత్య కేసులు నమోదయ్యాయని డీజిపి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

First Published:  29 Dec 2022 10:06 AM GMT
Next Story