Telugu Global
Telangana

తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం.. ఎన్నికల కమిటీలో చోటివ్వరా అంటూ సీనియర్ లీడర్ ఆగ్రహం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. పార్టీ అధిష్టానం ఈ లిస్టు విడుదల చేసి 24 గంటలు కాకముందే.. ఒక సీనియర్ లీడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం.. ఎన్నికల కమిటీలో చోటివ్వరా అంటూ సీనియర్ లీడర్ ఆగ్రహం!
X

ఇటీవల కాలంలో ఐక్యతారాగం వినిపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. అది మూన్నాళ్ల ముచ్చటే అని తేల్చిపారేశారు. పదవులు దక్కినంత కాలం మాత్రమే నోరు మూతపడి ఉంటుందని.. ఏ మాత్రం తేడా వచ్చినా అసమ్మతి గళం వినిపిస్తామని మరోసారి రుజువు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. పార్టీ అధిష్టానం ఈ లిస్టు విడుదల చేసి 24 గంటలు కాకముందే.. ఒక సీనియర్ లీడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంతగానో శ్రమిస్తున్న తనను ఎందుకు కమిటీలో తీసుకోలేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్‌కు చెందిన సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ పార్టీలో అసంతృప్తి గళం వినిపించిన దాఖలాలు లేని వ్యక్తి.. హఠాత్తుగా ఇలా ఎదురు తిరగడంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. కర్ణాటక ఎన్నికల గెలుపు తర్వాత.. తెలంగాణ కాంగ్రెస్‌లోకి చేరికలు కూడా భారీగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కీలక నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు స్వరం మార్చడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. కాంగ్రెస్ పెద్దల తీరు సమంజసంగా లేదని.. పని చేసే వ్యక్తులను పక్కన పెట్టడం ఏంటని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల కమిటీలో చోటు దక్కించుకున్న వారిలో చాలా మంది ఎన్నికల సమయంలో మాత్రమే కనపడే వ్యక్తులని.. గత నాలుగేళ్లుగా పార్టీ కోసం వారు చేసిందేమీ లేదని కూడా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా కష్టపడుతున్నాయి. అలాంటి సమయంలో పని చేసే నాయకులకు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ, కుల సమీకరణల పేరుతో తనను పక్కన పెట్టడంపై పొన్నం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ సీనియర్ నాయకుడు మల్లు రవి కూడా తనకు చోటు కల్పించకపోవడంపై మనస్థాపం చెందినట్లు తెలుస్తున్నది.

కాగా, ప్రస్తుతం ప్రకటించింది కేవలం ఎన్నికల కమిటీ మాత్రమే అని.. రాబోయే రోజుల్లో మరిన్ని కమిటీలు వేస్తామని.. అప్పుడు తప్పకుండా ఆయా నాయకుల పేర్లు పరిశీలిస్తామని రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఎన్నికల క్యాంపెయిన్, ఇతర ముఖ్య కమిటీల్లోకి తప్పకుండా తీసుకునే అవకాశం ఉందని కూడా చెబుతున్నాయి. అయితే రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అత్యున్నత కమిటీలో చోటు ఇవ్వకుండా.. ఏవో పనికిరాని వాటిలో చేరుస్తామనడంపై కూడా మండిపడుతున్నారు. మరి ఈ నాయకుల అసంతృప్తిని కాంగ్రెస్ పార్టీ ఎలా చల్లారుస్తుందో వేచి చూడాలి.

First Published:  21 July 2023 3:34 AM GMT
Next Story