Telugu Global
Telangana

తెలంగాణ కాంగ్రెస్ 'త్రిశూలం'.. ఎవరికి గుచ్చుకుంటుందో..?

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలాబలాలు తదితర అంశాలపై నేరుగా హైకమాండ్‌ కే ఆయన రిపోర్ట్ ఇచ్చారట. తెలంగాణలో కాంగ్రెస్‌ బలంగానే ఉందని ఆయన తన నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం

తెలంగాణ కాంగ్రెస్ త్రిశూలం.. ఎవరికి గుచ్చుకుంటుందో..?
X

ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన స్ట్రాటజీ ఉంటుంది. ఇటీవల వ్యూహకర్తల జమానా మొదలయ్యాక ప్రాజెక్ట్ లు, రిపోర్ట్ లు, గ్రాఫిక్స్ వర్క్స్ అంటూ హడావిడి పెరిగింది. అదే కోవలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కూడా త్రిశూల వ్యూహం అంటూ సరికొత్త విధానాన్ని తెరపైకి తెస్తోంది. అసలేంటి ఈ త్రిశూల వ్యూహం. ఈ వ్యూహంతో ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? కనీసం తన పరిస్థితి మెరుగు పరుచుకుంటుందా..?

కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను రెడీ చేశారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలాబలాలు తదితర అంశాలపై నేరుగా హైకమాండ్‌ కే ఆయన రిపోర్ట్ ఇచ్చారట. తెలంగాణలో కాంగ్రెస్‌ బలంగానే ఉందని ఆయన తన నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. ఆయనే ఈ త్రిశూల వ్యూహం ప్రతిపాదించారట.

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30 నుంచి 40 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు సునాయాశం అని తేల్చారు సునీల్. MIM నియోజకవర్గాలుగా ముద్రపడ్డ చోట కాంగ్రెస్ పూర్తిగా ఆశలు వదిలేసుకోవాలని, అయితే అక్కడ పోటీ ఉండాలని, స్థానికంగా పార్టీ బలం పెంచుకోవాలని ఆయన సూచించారట. ఇక నియోజకవర్గాలను సునీల్ మూడు జోన్లుగా విభజించారు. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా 119 నియోజకవర్గాలను విభజించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఈజీగా గెలిచే నియోజకవర్గాలను గ్రీన్‌ జోన్‌ గా పరిగణిస్తారు. ఇందులో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ స్థానాలు, సీనియర్లు బరిలో దిగే స్థానాలు, స్వల్ప ఓట్ల తేడాతో గతంలో ఓడిపోయిన స్థానాలు, కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారినవారి స్థానాలు ఉన్నాయి. ఆరెంజ్‌ జోన్‌ లో ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇంకాస్త కష్టపడితే ఫలితం దక్కతుంది. అక్కడ అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని, ప్రచారం ఉధృతంగా చేసి, సీనియర్లను తీసుకొచ్చి అక్కడే మకాం వేసేలా చేస్తా పార్టీకి అనుకూలమై ఫలితం వస్తుంది.

రెడ్ జోన్ కోసం కూడా వ్యూహాలు..

ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ గెలవని నియోజకవర్గాలను ఈ జాబితాలో చేర్చినట్టు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ల విషయంలో ప్రత్యేక వ్యూహాన్ని, యాక్షన్‌ ప్లాన్‌ ని సిద్ధం చేస్తున్నారట. ఈ మూడు జోన్ల వ్యవహారాన్నే త్రిశూల వ్యూహంగా చెప్పుకుంటున్నారు. మరి ఈ త్రిశూలం నిజంగా వైరి వర్గాలకు గుచ్చుకుంటుందా..? లేక అంతర్గత కుమ్ములాటలు ఎక్కువై సొంత పార్టీనే నేతలు త్రిశూలంతో పొడిచేస్తారా..? వేచి చూడాలి.

First Published:  1 Feb 2023 1:56 AM GMT
Next Story