Telugu Global
Telangana

టీకాంగ్రెస్ తొలి ప్రయత్నం అట్టర్ ఫ్లాప్

ప్రజా కోర్టు ప్రజలు లేక వెలవెలబోతోంది. ఈ కార్యక్రమం జనాలను ఆకర్షించలేకపోయింది. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలు, నేతల ప్రసంగాలే. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ టీమ్ సెటైర్లు పేలుస్తోంది.

టీకాంగ్రెస్ తొలి ప్రయత్నం అట్టర్ ఫ్లాప్
X

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పై ప్రజలకు కాస్తో కూస్తో నమ్మకం పెరిగి ఉండొచ్చు కానీ తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితులు కనపడ్డంలేదు. ప్రజలకే కాదు, కనీసం కాంగ్రెస్ నాయకులకు కూడా పార్టీ గెలుపుపై ధీమా లేదు. ఒకవేళ ఉంటే ఈపాటికే ఆ సిగ్నల్స్ కనపడేవి. కానీ విచిత్రంగా కుమ్ములాటలతో నాయకులు పార్టీని జనంలో మరింత పలుచన చేస్తున్నారు. అందుకే ఆ పార్టీ చేపట్టే కార్యక్రమాలు కూడా జనాలు లేక వెలవెలబోతున్నాయి.

సునీల్ కనుగోలు వ్యూహం బెడిసికొట్టిందా..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కొత్త కార్యక్రమాలతో ఆ పార్టీకి జవసత్వాలు తేవాలని చూస్తున్నారు. తిరగబడదాం-తరిమికొడదాం అనే నినాదంతో నూతన కార్యక్రమాలు రూపొందించారు. ప్రజా కోర్టు పేరుతో బహిరంగ సభలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాలని నాయకులకు సూచించారు. కానీ ప్రజా కోర్టు ప్రజలు లేక వెలవెలబోతోంది. ఈ కార్యక్రమం జనాలను ఆకర్షించలేకపోయింది. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలు, నేతల ప్రసంగాలే. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ టీమ్ సెటైర్లు పేలుస్తోంది. ప్రజా కోర్టు అనేది బాహుబలి సెట్టింగ్ వేసి, పులకేశి సినిమా చూపించినట్టుందని అంటున్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. కడుపు మంటలు, కక్కుర్తి అరుపులు, ఊపిరితిత్తులు పగిలేలా ఊకదంపుడు ఉపన్యాసాలు, నిరాధారమైన ఆరోపణలతో ప్రజా కోర్టు నిండిపోయిందని, అందుకే ఆ కార్యక్రమంలో ఖాళీ కుర్చీలే కనపడుతున్నాయంటూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు దాసోజు శ్రవణ్.


జనాలు రావట్లేదు సరే, కనీసం కాంగ్రెస్ అగ్రనేతలయినా ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారా అంటే అదీ లేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, జానా రెడ్డి వంటి సీనియర్లు కూడా ప్రజా కోర్టుకి దూరంగా ఉన్నారు. దీంతో జనం కూడా ఈ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అందుకే రేవంత్ రెడ్డి తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ ఆరోపణల సంగతి పక్కనపెడితే.. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ బలం నిరూపించుకోవాలంటే ముందు పార్టీలో ఐకమత్యం ఉంది అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి.

First Published:  13 Aug 2023 10:57 AM GMT
Next Story